
ఆసియా కప్‌లో భాగంగా 2025, సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. మరికొన్ని గంటల్లో దాయాదుల పోరు ప్రారంభం కానున్న వేళ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇండియా, పాక్ మ్యాచ్ బైకాట్ ట్రెండ్ హోరెత్తుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దని.. మ్యాచ్ బైకాట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. పహల్గాంలో టెర్రరిస్ట్ ఎటాక్‌కు చేసిన పాకిస్తాన్‌తో మ్యాచ్ వద్దని దేశంలోని పలువురు రాజకీయ నేతలు కూడా ముక్త కంఠంతో ఖండించారు.
ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తూ శివసేన (యుబిటి) ఆదివారం (సెప్టెంబర్ 14) మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. మ్యాచ్ బైకాట్ చేయాలంటూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాక్‌తో మ్యాచ్ ఆడటమంటే పహల్గాం ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను, ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సైనికుల త్యాగాలను అవమానించడమేనని శివసేన ఫైర్ అయ్యింది.
ఈ క్రమంలో శివసేన నేత ఆనంద్ దూబే మరింత ఆగ్రహనికి గురయ్యారు. ఇండియా, పాక్ మ్యాచ్ బైకాట్ చేయాలని.. లేదంటే ఆ మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయొద్దని డిమాండ్ చేస్తూ టీవీని పగలగొట్టి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం టీవీని కిందేసి తొక్కారు శివసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆనంద్ దూబే మాట్లాడుతూ.. ఇండియా, పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐకి పంపేందుకు టీవీని పగలగొట్టి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. మేము ఈ మ్యాచ్‌ను చూడాలనుకోవడం లేదని.. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని.. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తోన్న ఆ దేశాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మీరు నిజమైన దేశభక్తులైతే చివరి క్షణంలోనైనా మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పాక్‌తో మ్యాచ్ రద్దు చేసుకుని ఇండియా తిరిగిరండి మిమ్మల్ని భుజాలపై మోసుకుంటూ స్వాగతం పలుకుతామని ఇండియా క్రికెటర్లను కోరారు. కానీ మీరు పాక్‌తో మ్యాచ్ ఆడితే ఎట్టిపరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించమని.. ఎందుకంటే దేశం కంటే ఏదీ పెద్దది కాదని అన్నారు.