ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఘనంగా తెలుగు సంవత్సరాది

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఘనంగా తెలుగు సంవత్సరాది
  • ఊరురా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాలు

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల పరిధిలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరురా ఉగాది పచ్చడి సేవించి, సాయంత్రం పంచాంగ పఠనం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు , పలు గ్రామాల్లో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లను ఆలయాల చుట్టూ తిప్పారు.  రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణ బీజేపీ ఆఫీస్‌‌‌‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆ పార్టీ నాయకుడు ప్రతాప రామకృష్ణ పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. 

నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర సరస్వతి దేవి ఆలయంతోపాటు జిల్లా కేంద్రంలోని గండి రామన్న సాయిబాబా మందిరం, దేవరకోట వెంకటేశ్వర ఆలయం, కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మల్లన్న గుట్టపై గల హరి హర క్షేత్రం, నగరేశ్వరవాడ శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

కొండగట్టులో పంచాంగ శ్రవణం

శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కొండగట్టు ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్‌‌‌‌ తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆలయ అర్చకులు అధికారులు గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. మల్యాల మండలంలో వివిధ గ్రామాల్లో వేడుకలు ప్రజలు ఘనంగా  జరుపుకున్నారు. 

మహాశక్తి ఆలయంలో పంచాంగ శ్రవణం

కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీమహాశక్తి అమ్మవార్ల ఆలయంలో గురువారం సాయంత్రం పంచాంగ శ్రవణం జరిగింది. కార్యక్రమంలో హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు.