గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచారు..భవిష్యవాణిలో స్వర్ణలత

గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచారు..భవిష్యవాణిలో స్వర్ణలత

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. లష్కర్ బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

‘‘నాకు నిర్వహించిన పూజలను సంతోషంగా అందుకున్నాను. కానీ.. నాకు గతేడాది ఇచ్చిన వాగ్దానం మరిచారు.. ఎందుకు..?  మీకు కావాల్సినంత బలం ఇస్తాను. మీ వెంటనే ఉంటాను. కానీ.. మీరు మాత్రం నన్ను అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. ఈసారి వర్షాలు పడుతాయి. కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త.. మీరు మాత్రం భయపడొద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

రంగం కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.