పహల్గాం ఉగ్రదాడిపై యూఎన్ ఖండన .. భారత్​ పాక్​లకు యూఎన్​ చీఫ్​ విజ్ఞప్తి

పహల్గాం ఉగ్రదాడిపై యూఎన్ ఖండన .. భారత్​ పాక్​లకు యూఎన్​ చీఫ్​ విజ్ఞప్తి

న్యూయార్క్‌: పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి తర్వాత భారత్‌- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్​సీ) స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొన్నేండ్లలో ఎన్నడూ లేనంతగా తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని తెలిపింది. ఉగ్రదాడి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సూచించింది. ఈమేరకు సోమవారం  న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో యూఎన్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడారు. 

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. సంయమనం పాటించాలని ఇరు దేశాలను రిక్వెస్ట్ చేశారు. ఈ సమయంలో సైనిక ఘర్షణ నివారించడం ఎంతో అవసరమని తెలిపారు. ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో కలిగే భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనని ఆయన చెప్పారు. అయితే, ఇందుకు సైనిక చర్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. పొరపాట్లు చేయొద్దని, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతలు తగ్గించి శాంతిని పునరుద్ధరించే ఏ చర్యకైనా మద్దతు ఇచ్చేందుకు యూఎన్ రెడీగా ఉందని గుటెరస్‌ పేర్కొన్నారు.యూఎన్ఎస్​సీ ఈ అంశంపై క్లోజ్డ్-డోర్ సమావేశం నిర్వహించింది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.