మామూలు ఛీటింగ్ కాదు : వర్క్ ఫ్రమ్ హోం స్కీం అంటూ రూ.158 కోట్లు దోపిడీ

మామూలు ఛీటింగ్ కాదు : వర్క్ ఫ్రమ్ హోం స్కీం అంటూ రూ.158 కోట్లు దోపిడీ

కోవిడ్ మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం అనే ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది. దీనిని అదనుగా చేసుకొని కొందరు కేటుగాళ్లు జనాలను మోసం చేస్తూ  కోట్ల రూపాయిలు దండుకుంటున్నారు.   సాఫ్ట్ వేర్ రంగానికి చెందినవారు చాలా మట్టుకు అలవాటైపోయారని.. ఆ విధానానికి స్వస్థి చెప్పి ఆఫీసులకు రమ్మని చెబుతున్నా ఆసక్తిచూపించేవారు తక్కువవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇదే అదనుగా వర్క్ ఫ్రం హోం జాబ్స్ అంటూ ఆఫర్ చేసి నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది ఒక పెద్ద గ్యాంగ్. . .

వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తో ఇంటి నుంచి పని చెయ్యడానికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఖతర్నాక్ ముఠాను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అబ్దుల్ అహమ్మద్ నేతృత్వంలో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు పెద్దఎత్తున దాడులు చేశారు. తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నుంచి, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది బెంగళూరు చేరుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చీటింగ్ దందా నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. 

 బెంగళూరులోని ఒక గ్యాంగ్ భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఈ విషయంపై ఫిర్యాదులు రావడం.. బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగడం.. వీరికోసం గాలింపు చేపట్టడంతో ఈ బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. ఈ సందర్భంగా వారి చేతిలో మోసపోయిన వారి లిస్ట్, వారి ద్వారా వీరు సంపాదించిన సొమ్ము చూసిన వారికి ఒక్కసారిగా దిమ్మతిరిగిందని అంటున్నారు. ఆ స్థాయిలో వీరి దందా కొనసాగిందని చెబుతున్నారు.

బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మోసగాళ్లను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ లో మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారని తెలుస్తుంది. అరెస్టు అయిన వారిలో తెలంగాణ, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని తెలుస్తుంది. వీరంతా ఇప్పటివరకూ సుమారు 2,143 మందిని మోసం చేశారని అంటున్నారు.. కేసు విచారణ కొనసాగుతోందని బెంగళూరు సైబర్ క్రైం, సీసీబీ పోలీసులు తెలిపారు.అరెస్టయిన వారిలో బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, నయాజ్, ఆదిల్ ఉన్నారు., ముంబైకి చెందిన మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్ మరియు మిహిర్ శశికాంత్ షా. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారు తెలిపారు.

నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్‌ టాప్ లు, 15 సిం కార్డులు, 3 బ్యాంక్ చెక్ బుక్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇదే సమయంలో... ఇప్పటివరకు 2,143 ఖాతాల నుంచి రూ. 158 కోట్లా 94 లక్షలకు పైగా వారి అకౌంట్లకు బదిలీ చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 30 ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు రూ. 62 లక్షల 83 వేల రూపాయల నగదును జప్తు చేశారు.

 ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ తో డబ్బు సంపాదించాలనే కోరిక ఉండే యువతీ యువకులను సంప్రదించి మొదట కొంత డబ్బు ఇవ్వాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లింక్ పంపి నగదు వారి అకౌంట్లకు బదిలీ చేసుకున్నారు. అదేవిధంగా ఖతర్నాక్ గ్యాంగ్ వేల మందిని మోసం చేసింది. ఈసారి సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. సైబర్ మోసగాళ్లు కర్ణాటకలోని ఈ రాష్ట్రం వెలుపల నుండి వచ్చి బెంగళూరు నగరంలో నివసిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ జాబ్ పేరుతో మోసం చేసి పని ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మోసగాళ్లను పట్టుకోవడంలో విజయం సాధించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారు. 

దందా ఎలా సాగిందంటే...
ఇంట్లో కూర్చొని ప్రతినెల వేల రూపాయలు సంపాదించడానికి చక్కటి అవకాశం ఇస్తామని ప్రజలను పలు రకాలుగా నమ్మించి మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. 

పార్ట్ టైమ్, వర్క్ ఫ్రమ్ జాబ్స్ కోసం వెతుకుతున్న యువతీ యువకులను లక్ష్యంగా చేసుకున్న నిందితులు పక్కాప్లాన్ తో వారిని ముగ్గులోకి దింపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియాలో పలు అకౌంట్లలో నిరుద్యోగులకు గాలం వేశారు. ఇంట్లో ఉండే మీరు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి వారిని వలలో వేసుకుంటున్నారు. ఈ ప్రచారంతో పాటు రద్దీగా ఉన్న కాలేజీల వద్ద, బస్ స్టేషన్‌ గోడలపైనా పోస్టర్లు అతికించారు. ఇంట్లో కూర్చొని ప్రతినెల వేల రూపాయలు సంపాదించడానికి చక్కటి అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తెలుస్తుంది. ఇలా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేస్తూ.. ఆకర్షితులైన వారిని జాగ్రత్తగా డీల్ చేస్తూ.. వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూల్ చేసి.. అనంతరం వారితో కాంటక్ట్ కట్ చేసేవారని తమ విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.