డబుల్ ఇండ్లు 5లక్షలతో పూర్తికాదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

డబుల్ ఇండ్లు 5లక్షలతో పూర్తికాదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
  • సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఇస్తామంటున్న సర్కారు
  • మండిపోతున్న ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు
  • రూ.8 లక్షలకు పైగా ఖర్చయితదంటున్న ఇంజినీర్లు

మంచిర్యాల, వెలుగు: పేదలకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన సర్కారు ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. తర్వాత సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మాట మార్చారు.  సొంత స్థలంలో డబుల్​ బెడ్​రూం ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామని తాజా బడ్జెట్​లో ప్రకటించింది. దీంతో  సర్కారు ఇచ్చే పైసలు ఏ మూలకూ సరిపోవని పబ్లిక్ ​అంటున్నారు. గవర్నమెంట్​ ప్లాన్​ ప్రకారం..530 చదరపు అడుగుల్లో డబుల్​ బెడ్​రూమ్​ ఇల్లు కట్టాలంటే రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతుందని ఇంజినీర్లు తేల్చి చెబుతున్నారు. ఇటీవల సిమెంట్​, స్టీల్​, ఇసుక, కంకరతో పాటు మెటీరియల్​, లేబర్​రేట్లు భారీగా పెరగడంతో ఆ మేరకు కన్​స్ర్టక్షన్​ కాస్ట్​ ఎక్కువైందని స్పష్టం చేస్తున్నారు. 
కాంట్రాక్టర్లే చేతులెత్తేసిన్రు..
రాష్ర్టంలోని అర్హులైన పేదలందరికీ డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని 2014  ఎలక్షన్లలో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో డబుల్​ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. యూనిట్​ కాస్ట్ రూరల్​లో రూ.5.04లక్షలు, అర్బన్​లో అయితే రూ.5.30 లక్షలు, జీహెచ్ఎంసీలో జీ ప్లస్​3కి రూ.7లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వం పలుమార్లు టెండర్లు పిలిచినా రేట్లు గిట్టుబాటు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో కంపెనీలతో మాట్లాడి సిమెంట్​, స్టీల్​ మార్కెట్ రేటు కంటే తక్కవకే అందిస్తామని, ఇసుక ఫ్రీగా సప్లై చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ  స్పందన కరువైంది. చివరకు రాష్ర్టంలో పెద్ద పెద్ద వర్క్స్​చేస్తున్న బడా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి డబుల్​ బెడ్​రూం పనులను అప్పగించారు. కానీ వారిలోనూ పలువురు కాంట్రాక్టర్లు నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. 
నాసిరకంగా నిర్మాణాలు
వందలు, వేల కోట్ల విలువైన వర్క్స్​ చేస్తున్న కాంట్రాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో  డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలకు ఒప్పుకున్నారు. ఇందులో లాస్ వచ్చినా ఇతర ప్రాజెక్టుల్లో లాభాలు రాబట్టుకునే చాన్స్​ ఉండడంతో పనులు మొదలుపెట్టారు. అయితే వీటిలో క్వాలిటీ లోపించింది. కాంట్రాక్టర్లు కనీస క్వాలిటీ కూడా పాటించలేదు. పలుచోట్ల నిర్మాణ దశలోనే గోడలు, స్లాబ్​లు పెచ్చులూడి కూలిపోయిన  ఘటనలున్నాయి. ప్రారంభోత్సవాలకు ముందే డబుల్​ బెడ్​రూమ్స్​లోని డొల్లతనం బయటపడింది. నాసిరకంగా కట్టిన ఇండ్లలో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని పేదలు భయపడుతూనే ఉన్నారు.  
ఇండ్లు లేనోళ్లు 30 లక్షల..కట్టినవి 2.91 లక్షలు.. 
2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ర్టంలో 26 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవు. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లక్షలకు పైమాటే. ఏడేండ్లలో ప్రభుత్వం 2.91 డబుల్​ ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో 54 వేల ఇండ్లు కంప్లీట్​ కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 14వేల ఇండ్లను మాత్రమే పేదలకు ఇచ్చారు.   
ఇప్పటి లెక్క ప్రకారం రూ.8లక్షలకు పైనే.. 
సర్కారు ప్లానింగ్​ ప్రకారం డబుల్​ఇల్లు కట్టాలంటే ప్రస్తుత రేట్లలో రూ.8లక్షలకు పైగా బడ్జెట్​అవసరమవుతుందని ఇంజినీరింగ్​అధికారులు చెబుతున్నారు. మొత్తం 530 గజాల్లో రెండు బెడ్​రూమ్​లు, హాల్, కిచెన్​, బాత్​రూమ్​లు నిర్మించాల్సి ఉంటుంది. సిమెంట్ దర్వాజలు, ఐరన్​ డోర్లు, విండోలు పెడుతున్నారు. సిమెంట్​తో ఫ్లోరింగ్​ చేస్తు న్నారు. ఈ లెక్కన ప్రస్తుత మార్కెట్​ రేట్ల ప్రకారం రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా క్వాలిటీగా కట్టాలంటే బడ్జెట్​మరో రూ.2లక్షలు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పేదలకు నిరాశే...
పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు సొంత జాగాలుంటే రూ.3 లక్షలిస్తామని చెబుతుండడంతో ‘డబుల్​’ స్కీం అటకెక్కినట్టే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన పేదలు కిరాయి ఇండ్లల్లో ఉంటున్నారు. వాళ్లకు టౌన్లలో సొంత జాగలు లేకపోగా, కొనుక్కునే స్థోమత కూడా లేదు. పల్లెల్లో కూడా  ఇంటి జాగలు లేని దళిత, గిరిజనులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు డబుల్ బెడ్​రూమ్​ కలగానే మిగలనుంది. జాగలు ఉన్నవాళ్లు కూడా ఇల్లు కట్టుకోవాలంటే రూ.లక్షల్లో అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.