గడ్కరీ అడ్డుపడడంతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకున్నరు
హైదరాబాద్, వెలుగు: కేంద్రం, గవర్నర్, హైకోర్టు ఒత్తిడి తేవడం వల్లే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ దిగొచ్చారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనుకున్న ప్రయత్నాలకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అడ్డుపడడంతో కేసీఆర్ తన ఆలోచనను విరమించుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రుల ఒత్తిడితోనే ఆర్టీసీ కార్మికులను తిరిగి డ్యూటీల్లోకి తీసుకున్నారన్నారు. అయినా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై అబద్ధాలాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నేతలు చింతల రాంచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, మోహన్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళసైను కలిసి ఒక మెమొరాండం ఇచ్చారు. కార్మికులకు సెప్టెంబర్, అక్టోబర్ నెల జీతాలు చెల్లించేలా చూడాలని, ఐఏఎస్ అధికారి సునీల్ శర్మపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత లక్ష్మణ్ రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బకాయిలను రాష్ట్ర సర్కారే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ప్రయత్నించిందంటూ ఆరోపణలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మపై గవర్నర్ కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కొందరు ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ సర్కారుకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా తాము అండగా నిలుస్తామని చెప్పారు.


