- రామగుండం రీజియన్ లో పర్యటన
- 11వ బొగ్గుగని ఆవరణలో రూ.9 కోట్లతో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ చైర్ కార్ ప్రారంభం
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థకు భూగర్భ గనులు గుండెకాయలాంటివని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పిలుపునిచ్చారు.
శుక్రవారం సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11వ గనిలో రూ.9 కోట్లతో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ సిస్టమ్‌ను ప్రారంభించారు. గని ఆవరణలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీసూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న అన్ని భూగర్భ గనులు నష్టాల్లో నడుస్తున్నాయని, ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.9,200 ఖర్చు అవుతోందన్నారు. దీంతో నష్టాలు పెరిగి లాభాలు తగ్గుతున్నాయని తెలిపారు. నష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి కార్మికుడు కృషి చేయాలని, భూగర్భ గనుల్లో నడిచే మెషీన్లను పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు.
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాక్షన్‌లో ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడి నుంచే పవర్ ప్లాంట్లు బొగ్గు కొంటున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన బొగ్గును తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తే సింగరేణి సంస్థ కూడా తక్కువ ధరకే బొగ్గును అమ్మే అవకాశం ఉంటుందన్నారు.
కొన్నేండ్లుగా 60 నుంచి 65 మిలియన్ టన్నులకే వార్షికోత్పత్తి పరిమితమైందని, దీనిని 75 నుంచి 80 మిలియన్ టన్నులకు పెంచాలని కోరారు. అనంతరం ఓపెన్‌కాస్ట్ 5 ప్రాజెక్ట్‌ను సందర్శించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై రివ్యూ చేశారు. సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించి క్రీడా, వినోద సౌకర్యాలను పరిశీలించారు.
రామగుండం-1 ఏరియా జీఎం ఆఫీస్ లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నాణ్యత, వ్యయ నియంత్రణ చర్యలు, భవిష్యత్తు లక్ష్యాలపై రివ్యూ చేసి పలు సూచనలు చేశారు. ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, కోల్ మూవ్మెంట్ ఈడీ బి.వెంకన్న, మార్కెటింగ్ జీఎం తాడబోయిన శ్రీనివాస్, ఆర్జీ 3 జీఎం మధుసూదన్, ఆర్జీ 2 ఇన్చార్జి జీఎం రాముడు, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, మేనేజర్ మల్లేశం, సాయి ప్రసాద్, రామ్మోహన్రావు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్టీపీపీలో పర్యటన
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి సందర్శించారు. 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి బీహెచ్ఈఎల్, కేపీసీ, పవర్మెక్ కంపెనీల అధికారులతో మాట్లాడారు. 800 మెగావాట్ల ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎంవీ వేణుగోపాల్ తో ప్లానింగ్ డయాగ్రమ్ ద్వారా జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకొని ఎస్టీపీపీలోని సేఫ్టీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు.
మెయిన్ కంట్రోల్ రూమ్ లో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ ప్రొడక్షన్, పని తీరుపై ఆరా తీశారు. ఎఫ్జీడీ ప్లాంట్ పనులను పరీశిలించిన అనంతరం ఎస్టీపీపీ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారాయణ, డైరెక్టర్లు ఎం వెంకటేశ్వర్లు, తిరుమల రావు, ఈడీ వెంకన్న జాదవ్ పాల్గొన్నారు.
