రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం.. దేశ యావరేజ్​ కంటే ఇక్కడే ఎక్కువ

రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం.. దేశ యావరేజ్​ కంటే ఇక్కడే ఎక్కువ
  • దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటులో తెలంగాణనే నంబర్​ వన్ 

  • సెంటర్​ ఫర్​ మానిటరింగ్​ ఇండియన్​ ఎకానమీ సంస్థ రిపోర్టు

  • 8 ఏండ్లలో 21,802 ఇండస్ట్రీలతో 17.17 లక్షల జాబ్స్​ ఇచ్చామంటున్న సర్కార్​

  • ప్రభుత్వ లెక్కలన్నీ కాగితాలకే పరిమితమంటున్న నిరుద్యోగులు

  • ముందుకు పడని సర్కారు ఉద్యోగాల భర్తీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకువచ్చామని, వాటితో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వ పెద్దలు  చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతూనే ఉంది. దేశంలో అన్​ఎంప్లాయిమెంట్​ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంది. సెంటర్​ ఫర్​ మానిటరింగ్​ ఇండియన్​ ఎకానమీ సంస్థ (సీఎంఐఈ) తాజా రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. దేశ యావరేజ్​తో చూసినా రాష్ట్రంలో 2 శాతం నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో 8.8 శాతం నిరుద్యోగ రేటు ఉంటే.. దేశంలో 6.8 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ డేటాలో తేలింది. ఒకవైపు ప్రైవేట్​ సెక్టార్​లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లక్షల ఉద్యోగాలు రాకపోవడం, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నత్తనడకన సాగడంతో నిరుద్యోగ రేటు అంతకంతకూ పెరిగిపోతున్నది. 

లక్షల్లో ఉద్యోగాలిస్తే.. ఎందుకీ పరిస్థితి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు వస్తున్నాయని సీఎం కేసీఆర్, ఇండస్ట్రీస్​ మినిస్టర్​ కేటీఆర్​ అసెంబ్లీతో పాటు పలు వేదికలపై ప్రకటించారు. సర్కార్​ లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి ఎనిమిదేండ్లలో 21,802 ఇండస్ట్రీలకు అప్రూవల్స్​ ఇచ్చారు. ఇందులో మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్లే 98 శాతం ఉన్నాయి.  మొత్తం ఇండస్ట్రీలతో 17.17 లక్షల మందికి ఎంప్లాయిమెంట్ కల్పించినట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ లెక్కలు కాగితాలకే పరిమితవుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు ఇండస్ట్రీల వల్ల  లక్షల జాబ్స్​ వచ్చినట్లయితే..  చిన్న ప్రైవేట్​ జాబ్​ ప్రకటనకు వందలాది మంది ఎందుకు పోటీ పడాల్సి వస్తున్నదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వం చెప్పిన లెక్కలు సరైనవే అయితే తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎలా పెరుగుతుందని అం టున్నారు. నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్​టైల్​ పార్క్, ఫార్మాసిటీ, వైద్య పరికరాల స్పెషల్​ ఇండస్ట్రీ..  ఇందులో ఏదీ పూర్తి కాలేదు. అలాంటిది.. లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చాయో ప్రభుత్వానికే తెలియాలని నిరుద్యోగులు అంటున్నారు. 

సర్కార్​ కొలువుల భర్తీ ఎటుపాయె?

ప్రభుత్వ ఉద్యోగాల్లో 80 వేల ఖాళీలు ఉన్నాయని మార్చి నెలలో సీఎం కేసీఆర్  అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ 80 వేల ఉద్యోగాల్లో ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు.  ప్రభుత్వం నుంచి పోస్టులకు పర్మిషన్లు లేట్​చేయడం, పర్మిషన్​ ఇచ్చిన వాటికి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. సెపరేట్​ రిక్రూట్​మెంట్ బోర్డు ఉన్నా పోలీసు పోస్టుల భర్తీ ఇంకా ప్రాసెస్​లోనే ఉన్నది. టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​(టెట్​) ఫలితాలు వచ్చి మూడు నెలలవుతున్నా ఇంతవరకూ టీచర్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికీ ఉద్యోగాల ఖాళీల్లో ప్రభుత్వ పర్మిషన్లు రాని పోస్టులే 28 వేలు ఉన్నాయి. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. రాష్ట్ర సర్కార్​ మాత్రం వేలల్లో చెప్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.  ప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నట్లు  పీఆర్సీ కమిషన్​ చేసిన ప్రకటనే  ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు.

మూడు నెలల్లో 3 శాతం పెరిగింది

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. సీఎంఐఈ డేటా ప్రకారం.. ఈ ఏడాది జులైలో 5.8 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. ఆగస్టులో 6.9 శాతానికి.. సెప్టెంబర్​లో  8.3 శాతానికి చేరింది.  అక్టోబర్​లో 8.8 శాతంగా రికార్డయింది. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఏపీలో అక్టోబర్​లో 5.3 శాతం, కర్నాటకలో 2.7 శాతం, కేరళలో 4.8 శాతం, తమిళనాడులో 3.3 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. 

జాబ్​ల కోసం వెతుకులాట

ఇటీవల హైదరాబాద్​లోని ఒక ప్రముఖ కార్ల కంపెనీ షోరూంలో మూడు సేల్స్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల కోసం దాదాపు వెయ్యి మంది పోటీ పడ్డారు. దీన్ని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్​ సెక్టార్​లో ఏ చిన్న నోటిఫికేషన్​ వచ్చినా పోటీ భారీగా ఉంటున్నది. ప్రొఫెషనల్​ కోర్సులు చదివినప్పటికీ.. తక్కువ జీతమైనా, ఏ ఉద్యోగమైనా సరే వస్తే చాలు అని నిరుద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన బడా కంపెనీలు వచ్చి.. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉంటే తామెందుకు ఖాళీగా ఉన్నామని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినట్లు.. ప్రైవేట్​లోనూ ఎందుకు ఆ స్థాయిలో పోటీ ఉంటుందని అంటున్నారు.

చెప్పుడే కానీ.. అవకాశాలేవి?

తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నం. కానీ వివిధ శాఖల్లో లక్షన్నర ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు ఉండటం లేదు. తీవ్ర పోటీలో ఏదో ఒక ఉద్యోగం వచ్చినా జీతం రూ.10 వేలు, 15 వేలు మించడం లేదు.  హైదరాబాద్ చుట్టూ వేలాది ఇండస్ట్రీలు వచ్చాయని చెప్పడమే తప్ప అది ఎంతవరకు కరెక్ట్​ అని తెలియడం లేదు. ఉన్న కొన్ని ఉద్యోగాల్లోనూ  ఇక్కడి యువతకు అవకాశాలు దక్కడం లేదు. బయటి రాష్ట్రాలవాళ్లనే ఎక్కువగా తీసుకుంటున్నారు.  - కేఎస్ ప్రదీప్, పీవైఎల్ 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉద్యోగాల్లేవు.. లోన్లు రావు..

తెలంగాణలో ఇప్పుడున్న పెద్ద సమస్య నిరుద్యోగమే. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉప ఎన్నికల మీద ఉన్న దృష్టి.. పాలకులకు నిరుద్యోగుల బాధల మీద లేదు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సంఖ్యలో ఇండస్ట్రీలు వస్తే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండొద్దు కదా. తెలంగాణ వచ్చాక ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఎనిమిదేండ్లలో లక్షలాది మంది కొత్త నిరుద్యోగులు పెరిగిపోయారు.  స్వయం ఉపాధి కోసం సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వడం లేదు.  - డాక్టర్ సయ్యద్ వలీఉల్లా ఖాద్రీ,ఏఐవైఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు