- విద్యా రంగానికి రూ.1.39 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాకొక బాలికల హాస్టల్ నెలకొల్పుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేకాకుండా 15 వేల బడులు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని, ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) వద్ద విద్యకు 2 శాతం పన్ను తగ్గిస్తామని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అలాగే, మేజర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్ షిప్ లను నెలకొల్పడంలో రాష్ట్రాలకు సాయం చేస్తామని పేర్కొన్నారు.
2026–27 బడ్జెట్ లో విద్యా రంగానికి రూ.1.39 లక్షల కోట్లు కేటాయించారు. అందులో ఉన్నత విద్యకు రూ.55,727 కోట్లు అలాట్ చేశారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో మొత్తం 700 పైనే జిల్లాలు ఉన్నాయని, ఒక్కో జిల్లాలో ఒక బాలికల హాస్టళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. యూనివర్సిటీ టౌన్ షిప్ లలో వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్ ఇన్ స్టిట్యూషన్లు, స్కిల్ సెంటర్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులను నిర్మిస్తామని వివరించారు.
వెటర్నరీ కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబరేటరీలకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామన్నారు. ఇక సర్వీస్ సెక్టార్ పై సూచనలు చేసేందుకు ఉన్నత స్థాయితో కూడిన ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్ మెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్ స్టాండింగ్ కమిటీని మంత్రి ప్రతిపాదించారు.
విద్య, ఉపాధికి బూస్ట్ ఇచ్చే బడ్జెట్: ధర్మేంద్ర
యూనియన్ బడ్జెట్ పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ అన్నారు. అంతేకాకుండా విద్యకు, ఉపాధి కల్పనకు ఊతం ఇచ్చే బడ్జెట్ అని పేర్కొన్నారు. తదుపరి అభివృద్ధి దశకు ఈ బడ్జెట్ ఒక బ్లూప్రింట్ లాంటిదన్నారు.
‘‘దేశవ్యాప్తంగా విద్యను బలోపేతం చేయడానికి, ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కు భారీగా పెట్టుబడులను ప్రతిపాదించారు. ఈస్టర్న్ రీజియన్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు.” అని మంత్రి చెప్పారు
