మతపరమైన రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం : అమిత్ షా

మతపరమైన రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం : అమిత్ షా
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నం..
  • రాజ్యాంగాన్ని మార్చబోమన్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

గువాహటి: తాము మతపరమైన రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకమని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. రాజ్యాంగాన్ని మార్చబోమని తెలిపారు. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్​లో ఉన్న కాంగ్రెస్..బీజేపీ నినాదాలను తప్పుదోవ పట్టించేందుకు  ఫేక్ వీడియోలను తయారుచేస్తున్నదని ఆరోపించారు. ఫేక్ వీడియోలతో అసత్యాలను ప్రచారం చేస్తూ తద్వారా ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. 

అస్సాంలోని 14 లోక్‌‌‌‌సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం అమిత్ షా అస్సాంలో పర్యటించారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.." ఓటర్లను మేం మైనారిటీ లేదా మెజారిటీగా చూడడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉంది. వారి హక్కుల పరిరక్షణలో చురుకైన పాత్రను కూడా  పోషిస్తున్నది. ఈ విషయాన్ని  ప్రధాని నరేంద్ర మోదీ పలు బహిరంగ సభల్లోనూ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి, ఓబీసీలకు నష్టం కలిగించింది. 

ఎలాంటి సర్వే నిర్వహించకుండానే కర్నాటకలోనూ ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చింది. మైనారిటీలకు 4 శాతం కోటాను కేటాయించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాంగ్రెస్సే కాలరాసింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని బీజేపీ విశ్వసిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఆధారిత కోటాను కచ్చితంగా తొలగిస్తం" అని అమిత్ షా పేర్కొన్నారు. 

మహిళలను అవమానిస్తే సహించం

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలపైనా అమిత్ షా స్పందించారు. "మహిళలను అవమానించడాన్ని బీజేపీ సహించదు. హసన్ లోక్‌‌‌‌సభ నియోజకవర్గ అభ్యర్థి రేవణ్ణపై కాంగ్రెస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నది. అయితే, ఆ పార్టీని నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కర్నాటకలో ప్రస్తుతం ఎవరి ప్రభుత్వం ఉంది? ఆరోపణల్లో నిజం ఉంటే కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు" అని షా వివరించారు. 

కాంగ్రెస్​లో అసహనం పెరిగిపోయింది

అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోను ప్రసారం చేశారనే కేసులో  సోమవారం అస్సాంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై షా మాట్లాడుతూ.." నాతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల ఫేక్ వీడియోలను ప్రచారం చేసే స్థాయికి కాంగ్రెస్ లో అసహనం, నిరాశ పెరిగిపోయాయి. ఆ పార్టీకి చెందిన నేతలు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ ఫేక్ వీడియోలను ఫార్వార్డ్  చేశారు. 

ఇవన్నీ వారి అసంతృప్తిని వెల్లడిచేస్తున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలను మరింత దిగజార్చేపనిలో ఉన్నారు. ఈ తరహా వీడియోలతో ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం ఆమోదయోగ్యం కాదు. ఏ పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు" అని అమిత్ షా అన్నారు.