ఎమ్మెల్సీ కవిత చార్జ్​షీట్​పై మే29న తీర్పు

ఎమ్మెల్సీ కవిత చార్జ్​షీట్​పై మే29న తీర్పు

 

  • సప్లిమెంటరీ చార్జ్​షీట్​ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ముగిసిన వాదనలు   
  • లిక్కర్ స్కామ్​లో కవిత సహా ఐదుగురి పాత్రపై కోర్టుకు వివరించిన ఈడీ
  • హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్టు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది. ఈ నెల 10న కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై 8 వేల పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జ్ షీట్ డాక్యుమెంట్స్​ను ట్రంకు పెట్టలో కోర్టుకు సమర్పించింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ లను తాజా చార్జ్​షీట్ లో నిందితులుగా పేర్కొంది. 

ఈ చార్జ్​షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై మంగళవారం ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ కే మట్ట వాదనలు కొనసాగించారు. సోమవారం స్పెషల్ జడ్జి కావేరి బవేజా అడిగిన పలు వివరాలతో పాటు దామోదర్ శర్శ, అరవింద్ కుమార్, ఇతర నిందితుల పాత్రను కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్​లో కవిత కింగ్ పిన్ గా వ్యవహరించారని పేర్కొంటూ అప్రూవర్లు శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు. అలాగే హవాలా రూపంలో డబ్బులు మళ్లించడంలో ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. దామోదర్ శర్మ సైతం అక్రమ నగదు బదిలీల్లో ఉన్నారని చెప్పారు. దాదాపు రూ.50 లక్షలను హవాలా రూపంలో మళ్లించారని, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. తీర్పును ఈ నెల 29కి రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు.