షార్జా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. షార్జా మాస్టర్స్‌లో మరో డ్రా నమోదు చేశాడు. మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌లో పర్హమ్ మగ్సూద్ (ఇరాన్–4.5)తో తలపడిన అర్జున్ డ్రాతో గట్టెక్కాడు. స్టార్టింగ్‌లోనే బలమైన డిఫెన్స్‌తో ఆడిన ఇరాన్ ప్లేయర్.. అర్జున్‌కు పుంజుకునే చాన్స్ ఇవ్వలేదు. గేమ్ మధ్యలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ చకచకా పావులు కదుపుతూ ముందుకెళ్లినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు.
ఈ రౌండ్ తర్వాత అర్జున్ ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మరో గేమ్‌లో అరవింద్ చిదంబరం.. బ్రాడియా డానేశ్వర్ (ఇరాన్) చేతిలో ఓడి టాప్ ప్లేస్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం అరవింద్ 5 పాయింట్లతో ఉండగా, బ్రాడియా ఐదున్నర పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
