- పెరుగుతున్న ధరలతో సామాన్యుడు విలవిల
- మెట్రో సిటీల్లో ఒక్క వ్యక్తికి నెలకు 27,300 ఖర్చు
- నలుగురున్న ఫ్యామిలీకి ఏకంగా రూ.98 వేల బడ్జెట్
- ముంబైలో అద్దెలు ఇతర నగరాల కంటే రెండింతలు
- దేశంలోని మిగతా సిటీలతో పోలిస్తే హైదరాబాదే కాస్త బెటర్
- దేశంలోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్పై నంబియో రిపోర్ట్
న్యూఢిల్లీ:
దేశంలో మధ్యతరగతి జీవనం ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మెట్రో నగరాల్లో జీవన వ్యయం (కాస్టాఫ్ లివింగ్) విపరీతంగా పెరిగిపోతోంది. అంతర్జాతీయ గణాంక సంస్థ 'నంబియో' మార్చి 2026 నివేదిక ప్రకారం..పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పట్టణీకరణ వల్ల దేశవ్యాప్తంగా అద్దెలు, నిత్యావసరాల ధరలు 15 నుంచి 20% మేర పెరిగాయి. మన దేశంలోని మెట్రో నగరాల్లో ఒక వ్యక్తికి రెంట్ ఖర్చు లేకుండానే నెలకు సుమారు రూ. 27,300 ఖర్చు అవుతున్నది.
అలాగే, నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు సగటున రూ. 98 వేలు అవసరమవుతున్నాయి. ఇందులో మనం రోజువారీ కొనే పాలు, కూరగాయలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ , రవాణా ఖర్చులు కలిసి ఉంటాయి. నంబియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన న్యూయార్క్ నగరాన్ని ప్రామాణికంగా (100 పాయింట్లు) తీసుకుని మన దేశంలోని నగరాల వ్యయాలను లెక్కించింది. ఉదాహరణకు ముంబై కాస్ట్ ఇండెక్స్ 25.8 అంటే.. న్యూయార్క్‌లో రూ. 100 అయ్యే ఖర్చు ముంబైలో రూ. 25.8 అవుతుందని అర్థం. దీని ప్రకారం.. ప్రధాన నగరాల్లో ఖర్చులు సామాన్యుడి జేబును ఎలా ప్రభావితం చేస్తున్నాయంటే..
అద్దెల సెగ: ముంబై టాప్!
దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత ఖరీదైన నగరంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ కేవలం ఒక మోస్తరు ఇల్లు దొరకడమే కష్టతరంగా మారగా, అద్దెలు సామాన్యుడి జీతంలో సింహభాగాన్ని హరిస్తున్నాయి. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు కూడా అద్దెల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. నగర కేంద్రాల్లో నివసించాలంటే సగటున ఒక కుటుంబానికి కేవలం నివాసం కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పుణెలో క్వాలిటీ లైఫ్.. ఢిల్లీలో చీప్ మెట్రో, మెరుగైన జీవనానికి చెన్నై, కోల్‌కతా బెస్ట్ అని నంబియో నివేదిక వెల్లడించింది.
వంటింట్లో ధరల మంట
కేవలం అద్దెలే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పాలు, బియ్యం, బ్రెడ్ వంటి రోజువారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. పాలు లీటర్ ₹61కి చేరగా, బియ్యం కేజీ ₹56 వద్ద ఉన్నాయి. దీనికి తోడు పెట్రోల్ ధరలు ₹100 మార్కును దాటి స్థిరంగా కొనసాగుతుండటంతో రవాణా ఖర్చులు కూడా భారమయ్యాయి. సొంత వాహనం ఉన్నవారు నెలకు ఇంధనం కోసమే వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
మధ్యతరగతికి ఊరట ఎక్కడంటే..
అత్యంత ఖరీదైన ముంబై, ఢిల్లీలతో పోలిస్తే హైదరాబాద్, పుణె, కోల్‌కతా నగరాలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అద్దెలు ఇతర మెట్రోల కంటే అందుబాటులో ఉండటంతో, ఇక్కడ నివసించే వారి 'కొనుగోలు శక్తి' మెరుగ్గా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోల్‌కతా నగరం అన్ని మెట్రోల కంటే తక్కువ జీవన వ్యయంతో సామాన్యులకు ఇష్టమైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న కరెంట్ బిల్లులు, రవాణా ఖర్చులు మరియు ఇంటి అద్దెల నేపథ్యంలో 2026లో మెట్రో నగరాల్లో బ్రతకడం ఒక 'బడ్జెట్ యుద్ధం'లా మారింది. సరైన ప్లానింగ్ లేకపోతే నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించకపోతే మధ్యతరగతి జీవనం
మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది.
హైదరాబాద్.. కాస్త బెటర్
హైదరాబాద్ కాస్ట్ ఇండెక్స్ 21.1 గా ఉంది. కానీ ఇక్కడ రెంట్ ఇండెక్స్ కేవలం 5.6 పాయింట్లు మాత్రమే ఉండటం విశేషం. మెట్రో నగరాల్లో అత్యధిక కొనుగోలు శక్తి (పర్చేసింగ్ పవర్) ఉన్న నగరంగా హైదరాబాద్ (154 పాయింట్లు) నిలిచింది. అంటే ఇక్కడ వచ్చే ఆదాయంతో ఇతర నగరాల కంటే మెరుగైన సౌకర్యాలను పొందవచ్చు. అద్దె కాకుండా ఒక వ్యక్తికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 50 వేలలోపు ఖర్చవుతుంది. ఇతర మెట్రోలతో పోలిస్తే ఇది చాలా తక్కువే అని చెప్పొచ్చు.
