హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ : హరీశ్ రావు

హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ : హరీశ్ రావు

 

  • సన్న వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామనడం మోసం: హరీశ్ రావు 
  • నిరుద్యోగులకు రూ. 4 వేల భృతిపై మాటతప్పారు
  • రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇవ్వట్లేదని విమర్శలు 

హైదరాబాద్, వెలుగు: హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని.. ఇది ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్​లో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్​రావు మాట్లాడారు. వానకాలంలో 20 శాతం సన్నాలు, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు పండుతాయని చెప్పారు. ‘‘కోటి 20 లక్షల టన్నుల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇవ్వాలంటే రూ. 6 వేల కోట్లు కావాలి. సన్నాలకు మాత్రమే ఇస్తే రూ.500 కోట్లు సరిపోతాయి. 

అందుకే రైతులను మోసం చేస్తున్నారు” అని ఆయన ఫైర్ అయ్యారు. వడ్లకు బోనస్ విషయంలో సర్కారును వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. సర్కారు నిరుద్యోగులను కూడా మోసం చేస్తోందన్నారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని విమర్శించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి గతంలో మాదిరిగానే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం జొన్న, మిరప, పసుపు, సోయాబీన్, ఎర్రజొన్న ఇతర పంటలకు కూడా మద్దతు ధర ఇవ్వాలన్నారు. 

ఎకరాకు రూ. 25 వేల పరిహారమియ్యాలె 

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. క్వింటాలుకు 4, 5 కేజీలు తరుగు పెడుతున్నారని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన వడ్లు సహా అన్ని రకాల వడ్లు కొంటామని ప్రభుత్వం చెబుతోందని, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనడం లేదని రైతులు తనకు ఫోన్ చేస్తున్నారని చెప్పారు. భూసారం పెంచే జిలుగు, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోందన్నారు. రైతులు విత్తనాల కోసం కూడా కవర్లు లైన్లో పెడుతున్నారని అన్నారు.