
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లు ఎంతో కీలకమైనవని.. వాటిపై సీఎం రేవంత్రెడ్డి ఎక్కువ ఫోకస్ పెట్టాలని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ బకాయిలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నర్సయ్య గౌడ్మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.7,500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.1,400 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రిలీజ్ కాకపోవడంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. విద్యాసంస్థల మేనేజ్ మెంట్లు ప్రభుత్వం దగ్గరకు వెళితే.. అవి గత ప్రభుత్వ బకాయిలు అని చెప్పి తప్పించుకుంటున్నారని, ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల హాస్పిటల్స్ ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదని, పబ్లిక్ తో పాటు జర్నలిస్టుల హెల్త్ కార్డులు కూడా చెల్లడం లేదన్నారు.
కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా డీఏ, పీఆర్సీ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావొద్దని ఆయన సూచించారు. గత ఏడాదే కేసీఆర్ తెలంగాణ దశాబ్ది వేడుకలు జరిపారని, ఇప్పుడు మళ్లీ వేడుకలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇపుడు సన్న వడ్లకే ఇస్తమనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందేనన్నారు. లేకపోతే రైతులు తిరగబడుతారన్నారు. కేసీఆర్ సర్కారు లాగే.. ఈ ప్రభుత్వం కూడా అబద్ధాలు చెప్తోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి చిన్న వయసులో సీఎం అయ్యారని, ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉందని, ఆయన అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందాలని నర్సయ్య గౌడ్సూచించారు.