ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కాల్పులు

ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కాల్పులు

న్యూఢిల్లీ: నాగాలాండ్ లో పౌరులపై భద్రతా దళాలు కాల్పులకు దిగిన ఘటన మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రకటన చేశారు. ఈ ఘటన భారత్ ప్రభుత్వాన్ని కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఘటనా ప్రాంతంలో భద్రతా దళాలు మెరుపు దాడికి ప్లాన్ చేశాయన్నారు. అయితే అదే సమయంలో సాధారణ పౌరులతో ఉన్న వాహనం అటువైపుగా వచ్చిందన్నారు. వాహనాన్ని ఆపమని అలర్ట్ చేశారని.. కానీ వారు బండిని ఆపలేదన్నారు. 

వాహనాన్ని ఆపమంటే ఆపలే

‘వాహనాన్ని ఆపాల్సిందిగా సైనికులు హెచ్చరించారు. కానీ బండిని ఆపకపోగా, వేగంగా వెళ్లారు. దీంతో అందులో ఉగ్రవాదులు ఉన్నారేమోననే అనుమానంతో జవాన్లు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో వాహనం ఉన్న 8 మంది సాధారణ పౌరుల్లో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ తమ తప్పును తెలుసుకున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు అక్కడ ఉన్న సైనికులను చుట్టుముట్టి వారిపై దాడికి దిగారు. ఆర్మీకి చెందిన రెండు వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ సైనికుడు మృతి చెందాడు, చాలా మంది జవాన్లకు గాయాలయ్యాయి. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు జవాన్లు కాల్పులు చేయాల్సి వచ్చింది. దీంతో మరో 7 మంది పౌరులు చనిపోగా, కొందరికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారు. ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నా, నియంత్రణలోనే ఉంది. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్ లో ప్రాథమిక విచారణ జరుగుతోంది. ప్రత్యేక విచారణ టీమ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది’ అని అమిత్ షా అన్నారు.  

‘కాల్పుల ఘటన తర్వాత ఆదివారం సాయంత్రం మోన్ జిల్లా కేంద్రంలో 250 మంది  అస్సాం రైఫిల్స్ కంపెనీ ఆపరేటింగ్ బేస్ పై దాడికి దిగారు. వీరిని అడ్డుకునే క్రమంలో జవాన్లు చేసిన కాల్పుల్లో మరో పౌరుడు మృతి చెందాడు. ఇలాంటి ఘటనలను సమర్థంగా అడ్డుకునేందుకు మరిన్ని బలగాలను మోహరించాం. మృతి చెందిన పౌరుల కుటుంబాలకు ఆర్మీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనపై ఆర్మీలో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. చట్టం ప్రకారం సముచిత న్యాయం జరిగేలా చూస్తాం. ఘటన గురించి తెలిసిన వెంటనే నాగాలాండ్ గవర్నర్ తోపాటు సీఎంతో నేను మాట్లాడా. ఆ రాష్ట్ర పోలీసులతో నిరంతరం సంప్రదిస్తున్నాం. అక్కడి పరిస్థితులను నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. హోం మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఉన్నతాధికారిని రాష్ట్ర రాజధాని కోహిమాకు పంపాం. ఘటనపై అక్కడి రాష్ట్ర అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. పరిస్థితి గురించి సమీక్ష జరుపుతున్నారు. అక్కడ సుస్థిరత, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అమిత్ షా చెప్పారు.