జీవో 29ని ఉపసంహరించుకోవాలి

జీవో 29ని ఉపసంహరించుకోవాలి
  • సీఎం రేవంత్​రెడ్డికి బండి సంజయ్​ లేఖ

హైదరాబాద్, వెలుగు: పంతాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్​ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పరీక్షలని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను గమనించి గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. 29 జీవో వల్ల గ్రూప్1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారన్నారు. 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. 

మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు అని, 29 జీవో వల్ల ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే,  ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారన్నారు. జీవో నంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్​కు వ్యతిరేకమని తెలిపారు.  పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని అభ్యర్థులు వాపోతున్నారని లేఖలో సంజయ్​ పేర్కొన్నారు.