కరీంనగర్ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చిన : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

  కరీంనగర్ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చిన : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 
  • బుక్ లెట్ కొట్టించి ఇంటింటికీ పంపుతున్నా
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చానని, ఈ వివరాలన్నీ బుక్ లెట్ ప్రింట్ చేసి ఇంటింటికీ పంపిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ బుక్ లెట్ వివరాలు తప్పయితే తనపై కేసు పెట్టుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని నిధులు ఖర్చు చేశారో దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంగళవారం సాయంత్రం కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తాలో, పాత లేబర్ అడ్డా సమీపంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ మేయర్ సునీల్ రావుతోపాటు 9, 39, 40, 62, 63, 64 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ, పెద్దపల్లి శ్రీలేఖ, దేశ శిల్పా వేదం, గాదె శ్రీలేఖ తరఫున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి అని, వారికి ఎవరి పొట్ట కొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలనడమే  వాళ్ల నినాదాలని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ చుట్టుపక్కల జాగాలన్నీ కబ్జా చేశారని, గతంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓట్లేసి గెలిపిస్తే సగం మంది కబ్జాలు, నేరాలు చేసి జైలుకు పోయారని, అయినా సిగ్గు లేకుండా వాళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు.

రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిల్లిగవ్వ ఇయ్యలేదని ఆరోపించారు. మళ్లీ ఓట్లేసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే పైసలు ఎలా తెస్తారని ప్రశ్నించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కన్పించే లైట్ల పైసలన్నీ స్మార్ట్ సిటీ నిధులతో వేసినవేనని, అంబేద్కర్ స్టేడియం నుంచి గణేశ్‌‌‌‌‌‌‌‌నగర్ రోడ్డు దాకా అప్పుడెట్ల ఉండేదో, ఇప్పుడెట్లా ఉందో ఒక్కసారి యాది జేసుకోండని సూచించారు.

డంపింగ్ యార్డ్ దుస్థితికి మొదటి దోషి బీఆర్ఎస్సేనని ఆరోపించారు. మీరు ఆశీర్వదించి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వెంటనే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అంటే ‘ఖాన్’గ్రేస్ పార్టీగా మారిందని, అసలా ఆ పార్టీకి గ్రేస్ లేనే లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కాంగ్రెస్ కు లీడర్ ఎవరంటే చెప్పలేని దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నయన్నారు.