- ఇక్కడ కూడా కర్నాటక తరహాలోనే అసమ్మతి: బండి సంజయ్
- హిందువులపై దాడులు జరుగుతున్నా సోయి లేదా?
- బాన్సువాడలో అక్రమ అరెస్టులు ఆపకపోతే నేనే వస్తా.. అంతుచూస్తా
- కరీంనగర్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకుంటం
- బీఆర్ఎస్ మునిగిపోయే నావ..
- ఆ పార్టీకి మనుషులు దొరకట్లేదని ఎద్దేవా
హైదరాబాద్-వెలుగు: రాష్ట్రంలో రేవంత్ సర్కారుకు గ్యారంటీ లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఆ పార్టీ వాళ్లు ఇతరులకు ఇవ్వబోరని, కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూల్చుతారని వ్యాఖ్యానించారు. కర్నాటక తరహాలోనే తెలంగాణ కాంగ్రెస్‌లోనూ అసమ్మతి లొల్లి మొదలైందని, మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు నారాజ్‌గా ఉన్నారని ఆరోపించారు. హిందువులపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌కు సోయి లేదని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ అభినందించారు. అనంతరం వారితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని, లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో లొల్లి స్టార్ట్ అయిందని, కర్నాటకలో మంత్రి పదవుల కోసం రాహుల్‌కు 32 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసినట్టే.. తెలంగాణలోనూ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు అసమ్మతి సమావేశాలు పెట్టుకున్నారని అన్నారు. నియోజకవర్గాలకు నిధులివ్వడం లేదని ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ 18 సార్లు కేబినెట్ మీటింగ్ పెడితే, ఆరు గ్యారంటీల ఊసే లేదన్నారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే, సీఎం మాత్రం ఢిల్లీకి మూటలు మోయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు.
ఆలయాలపై దాడులు కొనసాగుతున్నయ్..
రాష్ట్రంలో హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి మొదలు.. సంతోష్ నగర్, బంజారాహిల్స్, శంషాబాద్ ఆలయాల వరకు దాడులు కంటిన్యూ అవుతున్నాయని పేర్కొన్నారు. అయినా సర్కారు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గోహత్యలు, లవ్ జిహాదీలు, డ్రగ్స్ ఇచ్చి హిందూ అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హనుమాన్, అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలను స్కూళ్లకు రానివ్వడం లేదని, హిందూ సమాజం ఐక్యం కాకపోతే మన బతుకులు ఆగం అవుతాయన్నారు. బాన్సువాడలో ఎంఐఎం నేతలు హిందువులపై రాళ్ల దాడి చేశారని, ఆ వీడియోలు డీజీపీకి పంపినా ఉలుకూ పలుకూ లేదని చెప్పారు. దాడి చేసిన వాళ్లను వదిలేసి.. దెబ్బలు తిన్న హిందువులను అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. ఎంఐఎం గూండాల అడుగులకు మడుగులొత్తడం మానుకోవాలని పోలీసులకు సూచించారు. ‘‘వెంటనే అక్రమ అరెస్టులు ఆపాలి. లేకపోతే నేనే స్వయంగా బాన్సువాడకు వస్తా.. హిందువులకు రక్షణ కవచంగా నిల్చుంటా.. మీ అంతు చూస్తా’’ అని వార్నింగ్ ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీపై కాషాయ జెండా ఎగరేస్తం..
కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కుట్రలు చేసినా.. బీజేపీ వ్యూహంతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని సంజయ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరేసి, మేయర్ సీటును కైవసం చేసుకుంటామన్నారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి ఎంఐఎంకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని పంజాబ్ స్వర్ణ దేవాలయం తరహాలో గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ఆ పార్టీకి మనుషులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
