మీ వల్లే మెట్రో లోన్ ఆగింది సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

మీ వల్లే మెట్రో లోన్ ఆగింది సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  • ఆదాయం నుంచి ముందుగా లోన్ కట్టాలనే కండిషన్​కు సీఎం ఒప్పుకోలే 
  • దీన్ని చర్చలతో పరిష్కరించుకోవాలి తప్ప విమర్శలతో కాదు
  • ఐఆర్ఎఫ్​సీ, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్​లో తేడా ఉంది
  • ఫైనాన్స్ చేయవద్దని నేను ఏ మంత్రికి చెప్పానో బయటపెట్టాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ ​మెట్రోకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్​సీ) నుంచి లోన్ ఆగడానికి సీఎం రేవంత్​రెడ్డే కారణమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. మెట్రోకు వచ్చే ఆదాయం నుంచి ముందుగా లోన్ కట్టాలన్న కేంద్రం సూచనకు సీఎం ఒప్పుకోలేదన్నారు. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప విమర్శల ద్వారా కాదని చెప్పారు.మెట్రోకు ఫైనాన్స్ చేయవద్దని తాను ఏ మంత్రికీ చెప్పలేదని, ఒకవేళ చెప్పి ఉంటే ఎవరితో అన్నానో రేవంత్ రెడ్డి బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ ​చేశారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏడేండ్లుగా కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి హోదాలో తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశానని, ఏనాడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తానే మెట్రోప్రాజెక్ట్ ను అడ్డుకుంటున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డివి దిగజారుడు రాజకీయాలని విమర్శించారు. తెలంగాణ‌‌లోని ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌‌రెడ్డి తన‌‌ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే తనను టార్గెట్ చేశారన్నారు. 

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం సహకారం..

దేశంలోని అన్ని మెట్రోల మాదిరిగానే హైదరాబాద్‌‌ మెట్రోకు కేంద్ర సహకారం అందిస్తోందని కిషన్​రెడ్డి అన్నారు. గతంలో మెట్రో ఫేజ్‌‌-1కు కేంద్రం రూ.1,250 కోట్లు ఇచ్చిందన్నారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ఆపాలని తానేందుకు చెబుతానని అస‌‌హ‌‌నం వ్యక్తం చేశారు. తాను వద్దంటే ఎక్కడా? ప్రాజెక్టులు ఆగవ‌‌న్నారు. ‘తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ విషయంలో రేవంత్‌‌రెడ్డి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. తెలంగాణ అభివృద్ధికై రూ.1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు నిర్మించాం. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులతో అభివృద్ధి చేప‌‌ట్టాం. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి స్టేషన్ల అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా.. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి స్పందించడం లేదు.

కేసీఆర్ సహకరించకపోయినా.. ఎంఎంటీఎస్ ఫేజ్‌‌–2ను కేంద్ర నిధులతో నిర్మించాం. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో అమలు చేస్తున్నాం. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఏ పార్టీ ప్రభుత్వమైనా.. వివక్ష లేకుండా సహకరిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే తెలంగాణ పురోగతికి కట్టుబడి ఉన్నామ‌‌న్నారు. తాజాగా 50 ఏండ్ల కోసం వడ్డీలేని రుణాలు కింద రూ.11వేల కోట్లు, మూసీ పునరుజ్జీవనం కోసం.. ఏషియా డెవలప్‌‌మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించినట్లు చెప్పారు.

చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి..

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని కిషన్ రెడ్డి అన్నారు. ఐఆర్‌‌ఎఫ్‌‌సీతో ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు తీసుకునేందుకు కేంద్రం సహకరించిందని తెలిపారు. లోన్ ఒప్పందం విషయమై అధికారులతో ఫోన్‌‌లో మాట్లాడానని చెప్పారు. అంతేకాకుండా మెట్రో ఫేజ్‌‌–2 మరింత వేగవంతానికి సీఎంకు లేఖలు రాసినట్లు చెప్పారు. ‘మెట్రో ఫేజ్‌‌–1 కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌‌ఎఫ్‌‌సీ ద్వారా రుణం తీసుకుంటోంది. ఈ లోన్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, ఐఆర్‌‌ఎఫ్‌‌సీ మధ్య ఒప్పందం జరిగింది. మెట్రో పూర్తి అయిన తర్వాత.. టికెట్లు, యాడ్‌‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని ముందుగా అప్పు చెల్లించాలని ఒప్పందంలో ఉందన్నారు.

కానీ, కేంద్ర సూచనలకు సీఎం అంగీకరించట్లేదు. ఏ మెట్రో ప్రాజె క్ట్​లు అయినా.. తీసుకున్న రుణాలు ఈ రూపంలో ముందుగా చెల్లించరు. రెగ్యులర్‌‌ మెట్రో ఆపరేషన్‌‌, నిర్వహణకు ముందుగా వచ్చిన ఆదాయం చెల్లించాలి. ఆ తర్వాతే రుణాలకు సంబంధించి మిగతా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది’ అని వివరించారు. ఈ విషయమై  కేంద్ర మంత్రి ఖట్టర్​తో జరిపిన భేటీలో.. ముందుగా లోన్ కట్టడంపై ఆలోచన చేయాలని సీఎంకి సూచించినట్లు చెప్పారు. ఈ లోన్ విషయంలో చర్చించినప్పటికీ స్పష్టత రాలేదన్నారు. దీన్ని చర్చించి నిర్ణయం తీసుకోవాలి, ఎన్​వోసీ విషయంలోనూ.. మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని హితవుపలికారు. ‘ముందుగా ఆపరేషన్, మెయింటెనెన్స్ చూడాలి. అప్పుడు మెట్రో సస్టేన్ అవుతుందని చెప్పాను. దీనికి సీఎం అంగీకరించలేదు. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. తప్ప విమర్శల ద్వారా సమస్యల పరిష్కారం కాదు’ అని అన్నారు. 

ఆధారాల్లేని ఆరోపణలు  సీఎం స్థాయికి తగవు

తాను ఫైనాన్స్ ఇవ్వొద్దని ఏ మంత్రి చెప్పారో? రేవంత్ చెప్పగలరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఊరికే ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయి వ్యక్తికి తగదని ఫైర్ అయ్యారు. గతంలోనూ మెట్రో విషయంలోనూ.. కేసీఆర్ అలైన్ మెంట్ మార్పుపేరుతో మూడేండ్లు కాలయాపన చేశారన్నారు. ప్రస్తుతం రేవంత్ కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి ఖట్టర్ తో సీఎం ఎప్పుడు సమావేశానికి వచ్చినా.. తాను కూడా వస్తాన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో త‌‌న‌‌కు ఎలాంటి భేషజాల్లేవని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి వస్తానన్నారు.