మూసీ బ్యూటిఫికేషన్‌కు బీజం వేసిందే బీఆర్ఎస్: కిషన్​రెడ్డి

మూసీ బ్యూటిఫికేషన్‌కు బీజం వేసిందే బీఆర్ఎస్: కిషన్​రెడ్డి
  • దాన్ని రేవంత్​ భుజాల మీద వేసుకున్నడు
  • పేదల ఇండ్లు కూలిస్తే ప్రభుత్వం కూలక తప్పదు
  • ఫాతిమా కాలేజీని ఎందుకు కూలుస్తలే?
  • మూసీ బ్యూటిఫికేషన్​ కోసం లక్షన్నర కోట్లేంది?
  • కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ దోపిడీ పార్టీలని విమర్శ

హైదరాబాద్, వెలుగు: మూసీ బ్యూటిఫికేషన్ కు బీజం వేసిందే గత బీఆర్ఎస్ సర్కార్​ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఆ విధానాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకొని పేద ప్రజల కడుపులపై తన్నుకుంటూ ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ‘‘గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోనే బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రేమ్ సింగ్ రాథోడ్ ను చైర్మన్​గా నియమించారు. పేదల ఇండ్లపై అప్పట్లోనే మార్కింగ్ చేశారు. కానీ ప్రజల నుంచి తీవ్ర నిరసన వెలువడటంతో వెనక్కి తగ్గారు” అని ఆయన తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో  గురువారం మీడియాతో కిషన్​రెడ్డి మాట్లాడారు. పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని హెచ్చరించారు. 

‘‘సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతాపాన్ని పేదల ఇండ్లపై కాకుండా అనేక చెరువుల్లోని బడాబాబులు, రాజకీయవేత్తల నిర్మాణాలపై చూపాలి” అని ఆయన అన్నారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ దోపిడీ పార్టీలని ఆరోపించారు. పాతబస్తీలోని ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

ఆ పిల్లల చదువు ఏం కావాలి?

‘‘పేదల ఇండ్లను కూలుస్తున్నారు. వారి పిల్లలకు విద్యా సంవత్సరం లేదా?  ఇండ్లు కూలిస్తే అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎక్కడికి పోవాలి. ప్రజల దృష్టిని మరల్చేందుకు గతంలో కేసీఆర్ కూడా ఇలాగే వ్యవహరించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నడు” అని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. హిమాచల్​ప్రదేశ్​ ఆర్థిక పరిస్థితే తెలంగాణలో రాబోతున్నదని, హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్, ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రాహుల్ చెప్పిండు. హైడ్రా కూల్చివేతలపై ఆయన సమాధానం చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతున్నదని, గల్లీగల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొందని..  డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. దాంట్లో రూ.50 వేల కోట్లతో పేదలకు ఇండ్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాజకీయాలను దిగజార్చారు

రాజకీయాల్లో కుటుంబాలు, మహిళల గురించి మాట్లాడడం బీఆర్ఎస్, కాంగ్రెస్​ నేతలకు అలవాటుగా మారిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘దాన్ని కేసీఆర్  మొదలుపెడితే.. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నడు. కుటుంబాలపై మాట్లాడే వారిని మీడియా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అలా వ్యాఖ్యానించిన వాళ్ల మాటలు టెలికాస్ట్ చేసినన్ని రోజులు ఆ నేతల తీరు మారదు. రాజకీయాలు ఎంత దిగజారుతున్నాయనేందుకు కొందరు నేతల చౌకబారు వ్యాఖ్యలే నిదర్శనం. రాజకీయాలను కేసీఆర్, రేవంత్ రెడ్డి  మరింత దిగజార్చారు” అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్​తో అనేక కుటుంబాల అంతర్గత విషయాలు కేసీఆర్​ విన్నారని కోర్టులో అఫిడవిట్ దాఖలైందని కిషన్​రెడ్డి తెలిపారు.