కేసీఆర్‍ ఎన్ని కోట్లు పంచినా గద్దె దిగక తప్పదు: కిషన్‌‌రెడ్డి

కేసీఆర్‍ ఎన్ని కోట్లు పంచినా గద్దె దిగక తప్పదు: కిషన్‌‌రెడ్డి
  • బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న బీఆర్‍ఎస్‍ హామీ ఏమైంది?
  • కాజీపేటకు రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్‍ యూనిట్‍ను కేంద్రం ఇచ్చింది
  • దేశంలో కోచ్‍ ఫ్యాక్టరీల అవసరంలేదు.. అందుకే దానికి సమానమైనది మోదీ ఇచ్చిన్రు
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌‌‌‌ దుష్ట రాజకీయాలు: బండి సంజయ్
  • వరంగల్‌‌లో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు

వరంగల్‍/హనుమకొండ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‍ ఎన్ని కోట్లు పంచినా గద్దె దిగక తప్పదని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అన్నారు. ‘‘అక్రమంగా దోచుకున్న వందలాది కోట్లను పంచి ఉప ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్​ చూసింది. రాబోయే ఎన్నికల్లోనూ వేల కోట్లు పంచడం ద్వారా మరోసారి గెలవాలని చూస్తున్నది. కానీ జనాలు డబ్బులకు లొంగకుండా బీఆర్‍ఎస్‍ను గద్దె దించేందుకు రెడీగా ఉన్నారు. కేసీఆర్ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆయన కుటుంబాన్ని దించేయడం తథ్యం. ఆయన ప్రగతి భవన్‍ నుంచి ఫామ్‌‌హౌస్‌‌కు వెళ్లడం తథ్యం” అని స్పష్టం చేశారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‍ పర్యటన నేపథ్యంలో కిషన్‍రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‍ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. మడికొండ అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న రైల్వే వ్యాగన్ ​మ్యాను ఫాక్చరింగ్‍ యూనిట్‍ స్థలాన్ని జిల్లా కలెక్టర్‍ సిక్తా పట్నాయక్‍, అధికారులతో కలిసి పరిశీలించారు. 

హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌‌లో ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. తర్వాత పార్టీ నేతలతో ఎస్‍వీ కన్వెన్షన్‍ హాల్‍లో విజయ సంకల్ప సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. కిషన్‍రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‍ తొమ్మిదేండ్లు సెక్రటేరియెట్‌‌కు పోలేదని, వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా సెక్రటేరియెట్ కట్టి అక్కడికీ పోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా ప్రగతి భవన్‍ కాదని.. అది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ప్రగతి భవన్‍ అని ఫైరయ్యారు. ‘‘ప్రజలను కలవడు. రైతు, విద్యార్థి, కుల, కార్మిక, మహిళా, ఉద్యోగ సంఘాలను సెక్రటేరియెట్‍కు, ప్రగతిభవన్‌‌కు రానివ్వడు. డైనింగ్‍ టేబుల్‍ నుంచి కొడుకు, బిడ్డ, అల్లునితో కలిసి కుటుంబ పాలన సాగిస్తున్నడు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానికి ప్రజా ప్రగతి భవన్‍ అని పేరు పెడ్తం” అని తెలిపారు.

బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍.. బొమ్మ బొరుసు పార్టీలు

కర్నాటక రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు వేరుగా ఉంటాయని కిషన్‍రెడ్డి చెప్పారు. రాబోయే పార్లమెంట్‍ ఎన్నికల్లో కర్నాటకలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‍ పార్టీని నడపలేనని రాజీనామా చేసిన వెళ్లిన వ్యక్తి రాహుల్‍ గాంధీ అని విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‍ పార్టీకి 19 సీట్లు గెలిపిస్తే.. అందులో నుంచి 12 మంది బీఆర్‍ఎస్‍ సంకన చేరారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనే అదే జరుగుతుందన్నారు. బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍.. బొమ్మ బొరుసు పార్టీలని సెటైర్లు వేశారు. అలాంటి కాంగ్రెస్‍ తామే బీఆర్‍ఎస్‌‌కి ప్రత్యామ్నాయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

బయ్యారం ఫ్యాక్టరీ హామీ ఇచ్చింది మీరే

‘‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 2018 ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍ పార్టీ హామీ ఇచ్చింది. కేసీఆర్‍, ఆయన కొడుకు కేటీఆర్‍, అల్లుడు హరీశ్‌‌వు పోటీపడి మరీ బయ్యారం ఫ్యాక్టరీ పెడ్తమని చెప్పారు. కేంద్రం సహకారం లేకున్నా దాన్ని ఏర్పాటు చేస్తామన్నరు. స్టేట్ గవర్నమెంటే సొంతంగా ఏర్పాటు చేయాలి’’ అని కిషన్‌‌రెడ్డి డిమాండ్‍ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నిజాం షుగర్‍ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. వరంగల్‌‌లో కుర్చీ వేసుకుని ఇండ్లు కట్టిస్తానని చెప్పారని, ఇప్పటికి ఎన్ని పంపిణీ చేశారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం వరంగల్‍ సిటీకి ప్రాధాన్యత ఇచ్చేందుకే స్మార్ట్ సిటీ, హెరిటేజ్‍, హృదయ్‍, అమృత్‍ వంటి ప్రాజెక్టులు ఇచ్చిందన్నారు. 

రూ.130 కోట్లతో వరంగల్‌‌ కేఎంసీలో సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ కట్టించిందన్నారు. ఎకో ట్రైబల్‍ సర్క్యూట్‍ కింద డెవలప్‍ చేయడమే కాకుండా హరిత గెస్ట్ హౌస్‌‌లు కట్టింది మోదీ ప్రభుత్వమేనని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవడానికితోడు మౌలిక సదుపాయలు కల్పించేందుకు కేంద్రం రూ.60 కోట్లను మంజూరు చేసిందన్నారు. ములుగు ట్రైబల్‍ యూనివర్సిటీకి సంబంధించి కేబినెట్‍లో త్వరలోనే బడ్జెట్‍ అప్రూవల్‍ ఇవ్వనున్నట్లు వివరించారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్‍ చెప్పారని.. మాట తప్పితే తల నరుక్కుంటానన్న మాట ఏమైందని నిలదీశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరానికి రూ.18,200 ఎరువుల మీద సబ్సిడీ ఇస్తోందని, ఇవేగాక ఏడాదికి మరో రూ.6 వేలు సాయం ఇస్తోందని అన్నారు.

బీఆర్ఎస్ దోపిడీని అరికట్టాలంటే బీజేపీ రావాలి: ఈటల

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నదని, కేంద్రానికి సహకరించని రాష్ట్రాలను కూడా డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని  ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

కాంగ్రెస్.. ఓ షాపింగ్ మాల్: బండి సంజయ్​

కేసీఆర్ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఓ షాపింగ్ మాల్ లాంటిదని, ఇప్పుడు అందులో ఓ కాస్ట్ లీ మెటీరియల్ వచ్చి చేరిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వద్ద డబ్బులకు కొదవ లేదని, ఆ కాస్ట్ లీ మెటీరియల్ ను ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, దుబ్బాక నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై గెలిచింది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. దుబ్బాక సహా మునుగోడు ఉప ఎన్నికల వరకు కాంగ్రెస్‌‌ పార్టీకి డిపాజిట్లే రాలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కుడుందని ప్రశ్నించారు. నేలవాలిన పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 

బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, -కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయని, ఒంటరిగా బీజేపీని ఓడించడం చేతగాకే రెండు పార్టీలు కలిసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ గడీల పాలనను అంతమొందించి రామరాజ్య స్థాపనే తమ ఏకైక లక్ష్యమన్నారు. పేదల పక్షాన పోరాడుతున్నామని, ప్రజలు కూడా బీజేపీనే ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌‌‌‌ దుష్ట రాజకీయాలు చేస్తున్నారని, ఎక్కడా అభివృద్ధి గురించి మాట్లాడటం లేదన్నారు. ప్రధాని హనుమకొండకు వస్తున్నారని, బీజేపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో 15 లక్షల మందితో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించబోతున్నామని చెప్పారు.

వ్యాగన్‍ యూనిట్‍.. కోచ్‍ ఫ్యాక్టరీతో సమానమే

కాజీపేటలో గతంలో చెప్పిన పీఓహెచ్‍కు తోడు ప్రధాని మోదీ సరికొత్తగా రైల్‍ వ్యాగన్‍ మ్యానుఫాక్చరింగ్‍ యూనిట్‍ మంజూరు చేశారని కిషన్‍రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశం లో కోచ్‍ ఫ్యాక్టరీల అవసరంలేని నేపథ్యంలో అంతే సమానమైన మ్యానుఫాక్చరింగ్‍ యూ నిట్‍ ఇవ్వడం ద్వారా ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చారన్నారు. ఈ యూనిట్లో ప్రతి నెలా 200 చొప్పున ఏడాదికి 2,400 రైల్వే వ్యాగన్లు తయారు చేస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే విధివిధానాలు, ఆదేశాలు రిలీజ్ చేస్తారని వెల్లడించారు. ఈ పనులకు ఈ నెల 8న ప్రధాని భూమి పూజ చేస్తారని తెలిపారు. పీఎం మిత్ర స్కీమ్‌‌లో భాగంగా దేశంలో 07 టెక్స్‌‌టైల్‍ పార్కులను ఎంపిక చేయగా.. అందులో వరంగల్‍ జిల్లా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్కు ఒకటని చెప్పారు. రాష్ట్రంలో 32 జిల్లాల మీదుగా జాతీయ రహదారులను అనుసంధానం చేస్తున్నట్లు కిషన్‍రెడ్డి పేర్కొన్నారు.