కేసీఆర్ను మించిన ఫాసిస్టు దేశంలో లేడు

కేసీఆర్ను మించిన ఫాసిస్టు దేశంలో లేడు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈటలను అసెంబ్లీలోకి రానివ్వను, మాట్లాడనివ్వను, ముఖం చూడను.. అనేలా పంతంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ ను మించిన ఫాసిస్టు దేశంలో ఇంకెవరూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘స్పీకర్ తొలుత అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాల్సింది సీఎం కేసీఆర్ నే .. శాశ్వతంగా శాసన సభ్యత్వం నుంచి కేసీఆర్ ను తొలగించాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వినడం ఇష్టం లేకుంటే.. కేసీఆర్ శాసనసభను బహిష్కరించి వెళ్లిపోవాలే తప్ప ఇలా అరాచకంగా వ్యవహరించకూడదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పును కాలరేచేలా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని ఆయన పేర్కొన్నారు.  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సీఎం కేసీఆర్ వాడితే అమృత పదాలా ?

‘‘ మరమనిషి అనే ఒక సాధారణ పదాన్ని ఈటల వాడితే.. దాన్ని అన్ పార్లమెంటేరియన్ పదంగా పరిగణించడం సరికాదు. ఎన్నో అన్ పార్లమెంటేరియన్ పదాలను సీఎం కేసీఆర్ వాడితే అమృత పదాలుగా పరిగణిస్తున్నారు. ఈటల రాజేందర్ నుంచో.. బండి సంజయ్ నుంచో ఏవైనా పదాలు వస్తే మాత్రం అన్ పార్లమెంటేరియన్ గా ముద్రవేసే దుష్ట  యత్నంలో కేసీఆర్ సర్కారు ఉందన్నారు. 

సీఎం అయితే ఎవరినైనా తిట్టే అధికారం ఉంటుందా ?

సీఎం అయితే ఎవరినైనా తిట్టే అధికారం ఉంటుందా ? అని కేసీఆర్ ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు ఉన్న 8 ఎంపీ సీట్లతో దేశాన్ని శాసించడం అసాధ్యమన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా.. కేసీఆర్ నిరంకుశ పోకడలు సాగుతున్నాయని కామెంట్ చేశారు.

మోడీ హైదరాబాద్ కు వస్తే మీరు సహించరు

‘‘ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తే మీరు సహించరు. మహిళ అనే ఆలోచన కూడా లేకుండా  రాష్ట్ర గవర్నర్ ను మీరు అవమానిస్తరు. అధికారం పోతుందనే అభద్రతా భావంలో కేసీఆర్ సర్కారు, మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారు’’ అని టీఆర్ఎస్ సర్కారుపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

మమ్మల్ని గోక్కోమని చెప్పకండి

‘‘ నువ్వు గోకక పోయినా.. నేను నిన్ను గోకుతూనే ఉంటాను అని ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ గతంలో వ్యాఖ్యలు చేశారు.  మీకు దురద పెడితే మీరు గోక్కోండి. మమ్మల్ని గోక్కోమని చెప్పకండి. గోకమని చెప్పకండి’’ అని సీఎం కేసీఆర్ కు ఆయన సూచించారు. ‘‘ఈడీ, సీబీఐ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు.. నిత్యం కలవరిస్తున్నరు. ఈడీ, సీబీఐ వస్తే రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ ను క్రియేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మీరు సంపాదించిందంతా సర్దుకోండి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటీవల ఒక మీటింగ్ లో కేసీఆర్ చెప్పారట.  అంటే ఏ రకమైన సందేశాన్ని కేసీఆర్ ఇవ్వదలిచారు?’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.