ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి

ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి
  • గాంధీ ఆస్పత్రిలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ వేగంగా సాగుతోందని కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడ కూడా వ్యాక్సిన్‌కు లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా మీడియాలో మాట్లాడారు. ‘వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నాం. దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్ అద్భుతంగా ప్రొడక్షన్ చేస్తున్నాయి. మన దేశంతో పాటు మరో 58 దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్ సరఫరా అవుతోంది. ముందుగా మన దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని వీలైనన్ని డోస్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రధాని సైతం కోవాక్సిన్ తీసుకున్నారు. నేను కోవిషీల్డ్ తీసుకున్నాను. ఏ వ్యాక్సిన్ అయిన మంచిగానే పనిచేస్తోంది. ప్రజలు ఏదో ఒక రకం వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ రోగులతో కలిసే అవకాశం లేకుండా ఆస్పత్రి వార్డ్‌లకు దూరంగా ఉండేలా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుచేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలి. వర్క్ ప్లేస్‌లో, షాపింగ్ మాల్స్‌లో మరియు బయటకి వచ్చినప్పుడు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలి. దేశంలో కోవిడ్ కేసులు, కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయి. ప్రజల సహకారం లేకుండా కోవిడ్‌ని అరికట్టలేం’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.