V6 News

రేవంత్‌‌‌‌ హైబ్రీడ్‌‌‌‌ నమూనా.. ప్రపంచంలో ఎక్కడా లేదు : కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

రేవంత్‌‌‌‌ హైబ్రీడ్‌‌‌‌ నమూనా.. ప్రపంచంలో ఎక్కడా లేదు : కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి
  • ఆ ఫార్ములాతో రంగారెడ్డిలో సీట్లు పెంచి, ఆదిలాబాద్‌‌‌‌లో తగ్గిస్తారా?: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి
  • ఉత్తర, దక్షిణాన్ని విభజించేలా సీఎం వ్యాఖ్యలు
  • చేతనైతే సమర్థించండి.. లేదంటే నోరు మూసుకోండంటూ ఫైర్‌‌‌‌‌‌‌‌
  • లోక్‌‌‌‌సభలో ప్రస్తుత సీట్ల ప్రాతిపదికనే కొత్త సీట్ల పెంపు
  • మహిళా బిల్లుతోపాటే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌‌‌‌సభలో ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రాతిపదికనే కొత్త సీట్లు పెంచనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌‌‌‌ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇప్పుడున్న సీట్ల పంపకాలను కొనసాగిస్తూ.. సీట్ల పెంపుదల చేస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు డీలిమిటేషన్ సవరణను సభ ముందుకు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పునర్విభజన చేసినప్పుడు.. దక్షిణాదికి 24% సీట్లున్నాయని, ఇప్పుడు అదే శాతంతో సీట్ల పెంపు ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వితండవాదంతో విమర్శించడం సరికాదని, ఆయన చెప్తున్న హైబ్రీడ్‌‌‌‌ నమూనా ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించి.. సవరణలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో చర్చించబోతున్నట్టు వెల్లడించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అనేది రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ అని నొక్కి చెప్పారు. దేశ జనాభాలో సగ భాగంగా ఉన్న 75 కోట్ల మంది మహిళల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధిలో ప్రాధాన్యత కల్పించేందుకే ఈ బిల్లును తెస్తున్నామని తెలిపారు. అయితే డీలిమిటేషన్‌‌‌‌పై ఇన్నాళ్లూ జనాభా ప్రాతిపదికన పెంపు వద్దన్న కాంగ్రెస్.. ఇప్పుడేమో జీఎస్డీపీ పేరుతో కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు.

 డీలిమిటేషన్‌‌‌‌లాంటి సున్నితమైన అంశాలను చర్చించి పరిష్కారం వెతకాలి తప్ప రాజకీయం చేయకూడదని అన్నారు.  అందరి సహకారంతో పార్లమెంట్‌‌‌‌లో మహిళా రిజర్వేషన్‌‌‌‌ బిల్లుకు సవరణలు తీసుకొచ్చి.. అమలు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ బిల్లుపై గత 50 ఏండ్లుగా చర్చ జరుగుతున్నదని అన్నారు. 2010లో కాంగ్రెస్  ప్రభుత్వం తెచ్చిన మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయినా.. వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌‌‌‌కు రేవంత్‌‌‌‌ రెడ్డి కోశాధికారి 

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ తర్వాత అతిమేధావి రేవంత్‌‌‌‌ రెడ్డి అని కిషన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీకి సీఎం కోశాధికారిగా మారారని అన్నారు. కేంద్ర మంత్రినైన తనను బంట్రోతని సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పెద్ద నేతలను బంట్రోతులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. తాజాగా కర్నాటక సీఎం ఢిల్లీకి వస్తే.. ఆయనకు మూడ్రోజులపాటు అడిగినా పార్టీ అధిష్టానం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీయే.. తెలుగు ప్రజలను, తెలుగు నాయకులను బంట్రోతులుగా చూసింది. ఇష్టారాజ్యంగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా సీఎంలను మార్చారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో  అంజయ్యను  రాజీవ్‌‌‌‌గాంధీ ఎలా అవమానించారో రేవంత్‌‌‌‌రెడ్డి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పుట్టుకే.. 

తెలుగు ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా భావించడంపై జరిగింది” అని వ్యాఖ్యానించారు.  మోదీ పాలనలో దక్షిణాదికి ప్రయార్టీ ఇస్తూనే ఉన్నామని,  11 ఏండ్లుగా దక్షిణాదినుంచి ఇద్దరిని ఉప రాష్ట్రపతులను చేశామని, ఆర్థిక, రక్షణ, వాణిజ్య, గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖలను అప్పగించామని తెలిపారు.  50 శాతం జనాభా ప్రాతిపదికన, 50 శాతం ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా ఉండాలనే హైబ్రిడ్ నమూనా సీఎం రేవంత్ తీసుకొచ్చారని,  ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రతిపాదన లేదన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్నది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పారు.  వెనుకబడిన వర్గాలను.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చేయూతనిచ్చి ముందుకు తేవాలనుకుంటారు తప్ప.. ఆర్థిక ప్రాతిపదికన ప్రకారం కాదన్నారు.

అసెంబ్లీ సీట్ల పెంపులోనూ (ఎమ్మెల్యేల సీట్ల).. ఆదిలాబాద్‌‌‌‌కు సీట్లు తగ్గించి.. రంగారెడ్డి, హైదరాబాద్ సీట్లు పెంచేలా నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించారు. దక్షిణాదిని, ఉత్తరాదిని విభజించేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేంద్రం చేస్తున్నదాన్ని చేతనైతే సమర్థించండి.. లేదంటే నోర్మూసుకొని కూర్చోండి’’ అంటూ ఫైర్​ అయ్యారు.  వితండవాదాలను పక్కనపెట్టి.. సానుకూలంగా ఈ బిల్లు పాసయ్యేలా రేవంత్‌‌‌‌రెడ్డి సహకరించాలని కిషన్‌‌‌‌రెడ్డి కోరారు.