నేను ఏ సంతకం చేయలేదు ‘హమాస్‌ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి క్లారిటీ

నేను ఏ సంతకం చేయలేదు ‘హమాస్‌ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి క్లారిటీ

హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా ప్రకటించినట్లు వెలుగులోకి వచ్చిన విషయంపై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ స్పందించారు. హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా గు​ర్తిస్తున్నారా..? అంటూ పార్లమెంట్‌లో ప్రశ్నగా ఉన్న పేపర్‌కు సమాధానంగా తాను ఎటువంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘స్టార్‌ గుర్తు లేని’ ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షీ సమాధానం ఇచ్చినట్లు లిఖితపూర్వకమైన పత్రం ఒకటి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. 

హమాస్‌కు సంబంధించి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చినట్టుగా ఉన్న కొన్ని దస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాను హమాస్ అంశానికి సంబంధించిన ఏ పేపర్‌పై సంతకం చేయలేదన్నారు. విచారణ ద్వారా బాధ్యులు బయటకు వస్తారని మీనాక్షి లేఖి ఎక్స్ (ట్విట్టర్) లో  తెలిపారు. ఈ ట్వీట్ ను కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి ఎన్‌ జైశంకర్‌, ప్రధాని నరేంద్రమోదీకి ‘ఎక్స్‌’లో ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 

కేంద్రమంత్రి కామెంట్స్ పై శివసేన(యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఫోర్జరీ జరిగి ఉంటుందని ఆమె అనుకుంటున్నారా..? ఒకవేళ అదే నిజమైతే.. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె నుంచి స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం అని అన్నారు.

హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్‌ రాయబారి భారత్‌ను అభ్యర్థించారు. కానీ.. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు మరింత విస్తరిస్తుండటంపై మాత్రం భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది.