కుక్కకు ఇచ్చిన విలువ అమరులకు ఇయ్యరా?

కుక్కకు ఇచ్చిన విలువ అమరులకు ఇయ్యరా?
  • కేసీఆర్​పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి ఫైర్​
  • అవినీతి సీఎంలకు ఏ గతి పట్టిందో గుర్తుంచుకో
  • విమోచనాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదు
  • పటాన్​చెరు సభలో జోషి
  • నిజాం అడుగు జాడల్లో కేసీఆర్​: కిషన్​రెడ్డి
  • మోడీ, షాను చూసి వణికిపోతున్న సీఎం: లక్ష్మణ్​

అవినీతికి పాల్పడ్డ వారి పరిస్థితి ఏమిటో కేసీఆర్​ గుర్తుపెట్టుకుంటే మంచిది. హర్యానాలో ఏమైంది..? బీహార్​లో ఏమైంది? అధికారంలో ఉండి దోచుకున్న వాళ్ల పరిస్థితి ఏమైంది? బీహార్​లో లాలూకు ఏ గతి పట్టిందో.. మొన్నటికి మొన్న కేంద్ర మాజీ మంత్రికి ఏ గతి పట్టిందో కేసీఆర్​ యాదికి తెచ్చుకోవాలి. వాళ్లంతా ఇప్పుడు బెయిల్​ తీసుకోవడానికి కూడా భయపడాల్సి వస్తోంది. వాళ్ల పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అవన్నీ కేసీఆర్​కు తెలుసు.- ప్రహ్లాద్​ జోషి , కేంద్రమంత్రి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ అమరవీరులను విస్మరించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి మండిపడ్డారు. కేసీఆర్ కారులో మజ్లిస్ కూర్చొని సవారీ చేస్తోందని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్​ఎస్​ సర్కార్​  అధికారికంగా జరిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని అన్నారు. ‘‘సీఎం కేసీఆర్​కు అహంకారం ఏ స్థాయిలో ఉందంటే తన ఇంట్లోని కుక్క చనిపోతే డాక్టర్ పై కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. ఆయన తన కుక్కకు ఇచ్చే విలువ, మర్యాదను కూడా తెలంగాణ అమరవీరులకు ఇవ్వడం లేదు” అని దుయ్యబట్టారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో పటాన్​చెరులో జరిగిన తెలంగాణ విమోచన సభకు జోషి ముఖ్య​అతిథిగా హాజరై ప్రసంగించారు. కాళేశ్వరం ఖర్చు రూ.30 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు ఎలా పెరిగిందని, దాని వెనుక ఉన్న మతలబు ఏందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతిని సహించబోదని హెచ్చరించారు. విమోచన దినాన్ని కేసీఆర్ పండుగలా జరుపాలని, అలా చేయకపోతే  చేసి చూపించే పరిస్థితులను బీజేపీ కల్పిస్తుందని, అది చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. విమోచన దినాన్ని అధికారికంగా జరిపిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్​.. ఇప్పుడు ఎందుకు జరిపించడం లేదో  బదులివ్వాలని డిమాండ్​ చేశారు.

ఎవరు ఊహించని విధంగా 370 ఆర్టికల్ ను రద్దు చేసిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణను ఎలా దారికి తేవాలో తెలుసని, అందుకు  వ్యూహా, ప్రతి వ్యూహాలు ఉన్నాయని అన్నారు.  తెలంగాణ విమోచన చరిత్రను తొక్కి పెట్టి, కల్వకుంట్ల చరిత్ర కోసం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం

పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటో  అందరికీ తెలిసిందేనని, అక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆమె ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ విజయం సాధించడం ఖాయమని ప్రహ్లాద్​ జోషి ధీమా వ్యక్తం చేశారు. అదే పరిస్థితి త్వరలో తెలంగాణలో కూడా రాబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భవ, ఫసల్ బీమా యోజన వంటి వాటిని ఇక్కడ అమలు చేయకుండా కేసీఆర్ దురహంకారంగా ప్రవర్తిస్తున్నారని, ఇది తెలంగాణ ప్రజలను ద్రోహం చేయడమేనని అన్నారు. సొంత మంత్రులకు కూడా అపాయింట్​మెంట్​ ఇవ్వని సీఎం కేసీఆర్​ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే అది చేసి చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ కు అధ్యక్షుడు దొరికే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, విమోచన దినాన్ని పండుగలా చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి జి.కిషన్‌‌‌‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  కె.లక్ష్మణ్‌‌‌‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌‌‌‌రావు, ఎంపీలు అర్వింద్‌‌‌‌, సోయం బాపురావు, గరికపాటి మోహన్‌‌‌‌రావు, ఎమ్మెల్సీ రామచందర్‌‌‌‌రావు, మాజీ ఎంపీలు జి.వివేక్‌‌‌‌ వెంకటస్వామి, జితేందర్​రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, నేతలు చాడ సురేశ్‌‌‌‌రెడ్డి,  పొంగులేటి సుధాకర్‌‌‌‌రెడ్డి, పేరాల శేఖర్‌‌‌‌రావు, శశిధర్‌‌‌‌రెడ్డి, బాబు మోహన్‌‌‌‌, రఘునందన్‌‌‌‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిజాం అడుగు జాడల్లో కేసీఆర్​: కిషన్​రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చేసేదిగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందుకు రాలేవని, ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే చేస్తోందని, దీనంతటికి మజ్లిస్ కారణమని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కీలుబొమ్మ చేసి మజ్లిస్​ ఆడిస్తోందని ఆరోపించారు. ‘‘కేసీఆర్ ను నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆయన ఇప్పుడు ఫాం హౌజ్ లో ఉన్నారో, ప్రగతి భవన్​లో ఉన్నారో కాని, తెలంగాణ విమోచన దినాన్ని జరిపిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు జరిపించడం లేదో సమాధానం చెప్పాలి” అని కిషన్​రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్​ఎస్​ పార్టీ.. మజ్లిస్  చంకలో చేరి నిజాం అడుగు జాడలో నడుస్తానని టీఆర్​ఎస్​ అధినేత చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు.  విమోచన దినాన్ని నిర్వహించాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు.

గద్దె దించుతాం: లక్ష్మణ్

నాడు నిజాం పాలన నుంచి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బండి హన్మంతు, షోయబుల్లాఖాన్, వందేమాతరం రామచంద్రరావు వంటి తెలంగాణ యోధులు పోరాడితే నేడు కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి ఈ తెలంగాణను కాపాడేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి చరిత్రను తొక్కిపెడుతున్న కేసీఆర్​తన చరిత్రను చెప్పుకునేందుకు యాదాద్రి గుడిలో బొమ్మలు చెక్కించుకున్నారని ఆయన దుయ్యబట్టారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని జమ్మూకశ్మీర్‌‌‌‌ సమస్యను మోడీ, అమిత్‌‌‌‌ షా కేవలం 70 గంటల్లో పరిష్కరించారని, ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు తెలంగాణ విమోచన దినాన్ని జరిపిస్తారనే భరోసా ఇవ్వడం కోసం ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీని చూసి కేసీఆర్‌‌‌‌ నిద్రలేని రాత్రులు గుడుపుతున్నారని..  మోడీ, అమిత్‌‌‌‌ షాను చూసి నిద్రలో వణికిపోతున్నారని ఆయన విమర్శించారు. వచ్చే సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించకపోతే  కేంద్రం జోక్యం చేసుకుని నిర్వహించే విషయాన్ని ఆలోచిస్తుందన్నారు.

Union Minister Prahlad Joshi Fire on CM KCR