హైదరాబాద్, వెలుగు: సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు అందించే వస్తువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పంపిణీ చేసే బూట్లు, బెల్టులపై ప్రత్యేక యూనిక్ ఐడీ నంబర్‌ను ముద్రించాలని నిర్ణయించింది. ఈ కిట్ల పంపిణీలో జరిగే అక్రమాలకు చెక్‌పెట్టడంతో పాటు, నాణ్యతను పర్యవేక్షించేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో సుమారు 18.70 లక్షల మంది విద్యార్థులకు బ్లాక్ బూట్లు, బెల్టులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వస్తువులు పక్కదారి పట్టకుండా యూనిక్ ఐడీ కీలక పాత్ర పోషించనుంది. దీనివల్ల ఎక్కడైనా మార్కెట్లో కనిపిస్తే, వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ ఐడీ ద్వారా ఏ వస్తువు ఏ స్కూల్‌కు వెళ్లిందని గుర్తించడం ఈజీగా కానున్నది.
