Asia Cup 2025: ఆసియా కప్‌లో యూఏఈ బోణీ.. ఒమన్ ఓటమితో సూపర్-4కు ఇండియా

Asia Cup 2025: ఆసియా కప్‌లో యూఏఈ బోణీ.. ఒమన్ ఓటమితో సూపర్-4కు ఇండియా

ఆసియా కప్ లో ఆతిధ్య యూఏఈ తొలి విజయాన్ని అందుకుంది ఇండియాపై తొలి మ్యాచ్ లో ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్న యూఏఈ సోమవారం (సెప్టెంబర్ 15) ఒమన్ పై ఘన విజయం సాధించింది.   అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన యూఏఈ 42 పరుగుల తేడాతో నెగ్గి సూపర్- 4 రేస్ లో నిలిచింది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో ఒమన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. యూఏఈ, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు టీమిండియాతో పాటు సూపర్-4 కు అర్హత సాధిస్తుంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముహమ్మద్ వసీం 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ అలీషన్ షరాఫు (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఆర్యాన బిస్త్ 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జునైద్ సిద్ధిక్ 4 వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాసించాడు. 

►ALSO READ | Asia Cup 2025: పొమ్మనలేక ప్లేయింగ్ 11లో ఉంచినట్టుంది.. శాంసన్ కంటే ముందుగానే దూబే బ్యాటింగ్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన యూఏఈకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అలీషన్ షరాఫు, ముహమ్మద్ వసీం తొలి వికెట్ కు 88 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. హాఫ్ సెంచరీ చేసిన షరాఫు (51) ఔట్ కావడంతో జట్టు బాధ్యతను కెప్టెన్ వసీం తీనుకున్నాడు. జోహాబ్, కౌశిక్ లతో భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు స్కోర్ ను 170 పరుగులకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో ఒమన్ పూర్తిగా తడబడింది. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. జునైద్ సిద్ధిక్ తో పాటు ముహమ్మద్ జవాదుల్లా, హైదర్ అలీ విజృంభించి యూఏఈకి విజయాన్ని అందించారు.