
ఆసియా కప్ 2025 తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తుది జట్టులో స్థానం దక్కుతుంది. టోర్నీకి ముందు సంజు స్థానంపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ప్లేయింగ్ 11 లో చోటు దక్కుతుంది. అయితే ఇప్పుడు మరొక సమస్య వచ్చి చేరింది. అదేంటో కాదు బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయాలి. ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ బ్యాటింగ్ కు వస్తున్నారు. ఐదో స్థానంలో శాంసన్ బ్యాటింగ్ కు దిగాల్సి వస్తోంది.
పాకిస్థాన్ తో ఆదివారం (సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత శాంసన్ స్థానంలో ఐదో స్థానంలో శివమ్ దూబే బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ రకంగా చూసుకుంటే ఆసియా కప్ లో భాగంగా మిగిలిన మ్యాచ్ ల్లో సంజు ఖచ్చితంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడని చెప్పలేం. డెత్ ఓవర్లలో దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ లాంటి పవర్ హిట్టర్లు ఉండడంతో అసలు ఈ టోర్నీలో శాంసన్ బ్యాటింగ్ వస్తాడో లేదో గ్యారంటీ లేదు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయలేకపోవడం శాంసన్ కు మైనస్ గా మారింది.
ఒకవేళ టీమిండియా త్వరగా మూడు వికెట్లు కోల్పోతే మాత్రం శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా జట్టుకు శుభారంభం అందితే మాత్రం శాంసన్ బ్యాటింగ్ కు ఎప్పుడు దిగుతాడా చెప్పడం కష్టం. వికెట్ కీపర్ గానే సంజు శాంసన్ టీమిండియాలో కొనసాగుతున్నట్టు నెటిజన్స్ భావిస్తున్నారు. గిల్ కోసం శాంసన్ ను ఓపెనర్ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో కూడా అవకాశం ఇవ్వకుండా అతని భవిష్యత్ ను ప్రశ్నర్ధకం చేస్తున్నారు. ఆసియా కప్ మిగిలిన మ్యాచ్ ల్లో అయినా శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడా లేదో చూడాలి.