ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు అనధికారిక సెలవు

ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు అనధికారిక సెలవు

వ్యతిరేకిస్తున్న టీచర్స్‌‌ యూనియన్లు

నిజామాబాద్,  వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ పర్యటన సందర్భంగా సోమవారం ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఆఫీసర్లు అనదికారికంగా సెలవు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అసలే సెప్టెంబర్‌‌‌‌ 5 టీచర్స్‌‌ డే కావడం ఆయా స్కూళ్లలో వేడుకలకు ప్లాన్‌‌ చేసుకున్న తరుణంలో బడి బంద్‌‌ పెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను సీఎం సభ జనసమీకరణకు వినియోగించుకోవడానికే ట్రాఫిక్ ఇబ్బందుల పేరిట సెలవు ప్రకటించారని ఆరోపిస్తున్నాయి.  అయితే విషయంపై విద్యాశాఖ , ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

2 లక్షల మంది టార్గెట్‌‌...

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లా నుంచి 2 లక్షల మందిని సీఎం సభకు తరలించేందుకు టీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకత్వం ప్లాన్‌‌ చేస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 వేల మందిని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. ఇందుకు జిల్లాలో 6 ఆర్టీసీ బస్ డిపోల్లో బస్సులతో పాటు నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట డిపోల నుంచి కూడా బస్సులను అద్దెకు తీసుకుని జనాన్ని తరలించేందుకు టీఆర్ఎస్ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లాలో ప్రైవేట్ బడులకు చెందిన 826, ప్రైవేట్ ఇంజినీరింగ్,  జూనియర్ కాలేజీలకు చెందిన 100 బస్సులు కూడా జన సమీకరణకు వాడుకునేందుకు ప్లాన్‌‌ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్‌‌ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారని తెలుస్తోంది. 

సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు 

జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లు ఉండగా మెయిన్​రూట్లలో ఆదివారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూలాంగ్, వర్ని, బోర్గాం, ముబారక్ నగర్ ప్రాంతాలను జిల్లా నలుమూలల నుంచి వచ్చే బస్సులు వాహనాలను సిటీలోకి రాకుండా రూట్‌‌ డైవర్షన్‌‌ చేశారు. ప్రధానంగా విద్యా సంస్థలు, బోర్గాం, ఆర్యనగర్ వినాయక్‌‌నగర్‌‌‌‌, వర్నిరోడ్, ప్రగతినగర్ ఖలీల్‌‌వాడి, ఆర్మూర్ రోడ్‌‌లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. జన సమీకరణకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను వినియోగిస్తుండడంతో అనధికారికంగా వారికి సెలవు ఇచ్చినట్లు ప్రకటించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర హాలీడేలో వర్కింగ్ డే నిర్వహించాలని ఆఫీసర్లు సూచించినట్లు సమాచారం.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సీఎం  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పర్యటన ఏర్పాట్లపను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం ముందుగా జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌‌‌‌ను, అనంతరం సమీకృత కలెక్టరేట్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. తర్వాత గిరిరాజ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం సభ సక్సెస్‌‌‌‌ చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌‌‌‌, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌‌‌‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మార్క్‌‌‌‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్‌‌‌‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి,  సీపీ నాగరాజు పాల్గొన్నారు.

సరైన విధానం కాదు

సీఎం సభ కోసం ఆఫీసర్లు ట్రాఫిక్ ఆంక్షల పేరుతో సెలవు ఇవ్వడం సరికాదు. జన సమీకరణకు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు వినియోగం సరైన పద్ధతి కాదు.   

- సల్లా సత్యనారాయణ, టీపీటీఎఫ్‌‌ జిల్లా జనరల్ సెక్రటరీ