కొణిజర్ల, వెలుగు : సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొణిజర్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. మండలంలోని దిద్దుపూడి, కొణిజర్ల, కొత్తకాచారం, పెద్దమునగాల, చిన్నమునగాల, తనికెళ్ల, తుమ్మలపల్లి తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. మొక్కజొన్న పాలు పోసుకునే దశలో ఉండగా, భారీ వర్షానికి చేతికందకుండా పోయింది.
పలు గ్రామాల్లో ఆరబోసిన మిరపకాయలు వర్షానికి తడిశాయి. వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మంగళవారం వివిధ పార్టీల నాయకులు పరిశీలించారు. మరోవైపు కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయశాఖ అధికారి బాలాజీ పరిశీలించారు. మండలంలో సుమారు 15 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
