ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తాం అంటూ ప్రమాణ స్వీకారం చేయడం మనం రోజూ చూస్తుంటాం. కానీ అవినీతి సొమ్మును అందరూ కలిసి సమంగా పంచుకుంటామంటూ గంగాజలం చేతిలో పట్టుకుని మరీ కొందరు ప్రజాప్రతినిధులు ప్రమాణం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కౌన్సిలర్లంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గంగాజలం సాక్షిగా..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో మున్సిపల్ కౌన్సిలర్‌గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి పవిత్ర గంగాజలం ఉన్న పాత్రను చేతిలో పట్టుకుని కనిపిస్తున్నాడు. కార్పొరేషన్‌లో అందే లంచాల సొమ్మును ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా మొత్తం 60 మంది సభ్యుల మధ్య సమానంగా పంచుకోవాలని అతను ప్రమాణం చేస్తుండగా.. చుట్టూ ఉన్న గుంపు అందుకు అనుకూలంగా ప్రవర్తించారు. ఈ ప్రమాణాన్ని ఉల్లంఘించిన వారిని సమాజంలో 'ద్రోహి'గా పరిగణిస్తామంటూ అభ్యంతరకరమైన పదజాలాన్ని కూడా వాడారు. అంతేకాకుండా గ్రూప్‌లో ఎవరికైనా సమస్య వస్తే అందరూ ఐకమత్యంగా నిలవాలని ప్రతిజ్ఞ చేయడం విస్మయకరంగా ఉంది.
UP councillors in Shahjahanpur reportedly took a Gangajal oath to equally share the municipal corporation’s earnings, sparking allegations of corruption and questions over public money. pic.twitter.com/P4dt07sFw4
— Ground Eye 🇮🇳 (@TapasyaYaa83081) August 25, 2026
అక్రమార్జనపై పెరుగుతున్న ఆరోపణలు..
ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా కౌన్సిలర్లపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3 ఏళ్ల క్రితం ఒక్కటే ఇల్లు ఉన్న కొందరు కౌన్సిలర్లు, ఇప్పుడు అనూహ్యంగా విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లకు ఓనర్స్ అయ్యారని నెటిజన్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా, అవినీతి సొమ్మును పంచుకోవడానికి ఇలా బహిరంగంగా గ్రూప్‌లు కట్టి ప్రమాణాలు చేయడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
స్పందించిన మున్సిపల్ యంత్రాంగం..
ఈ దారుణమైన ఘటనపై స్థానిక యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. మున్సిపల్ కమిషనర్ సౌమ్య గురురాణి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వీడియో గతేడాది నవంబర్ 2025లో వేరే మున్సిపల్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్న సమయంలో రికార్డయినట్లు ప్రాథమికంగా తెలిందని తెలిపారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై అత్యంత సీరియస్‌గా స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. విచారణలో నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ALSO READ : కర్ణాటకలో పూర్తి వందే మాతరం ఉండదు
ప్రజలకు సేవ చేయాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులే ఇలా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ.. లంచాల పంపకాల కోసం రహస్యంగా గ్రూపులు కట్టి ప్రమాణాలు చేయడం దేశ రాజకీయాల్లో నైతిక పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.
