లక్నో: ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో మాతృదినోత్సవం నాడే ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కిషోర్ గుప్తా కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. రాజ్ కిషోర్ తండ్రి తమ పూర్వీకుల భూమిని ఇటీవల విక్రయించారు. అయితే, తన అంగీకారం లేకుండా ఆస్తిని ఎలా అమ్ముతారంటూ రాజ్ కిషోర్ తన తండ్రితో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో మరోసారి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన రాజ్‌కిషోర్.. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో తల్లి, తమ్ముడిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరూ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. పూర్వీకుల ఆస్తిని తండ్రి అమ్మడాన్ని రాజ్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకించాడని పోలీసులు తెలిపారు. ఆ కోపంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడని చెప్పారు.
