అమ్రోహా(యూపీ): ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఎన్హెచ్ 9 పై వేగంగా దూసుకెళుతున్న కారు అదుపుతప్పి ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖ్యాలీపూర్ ధల్ సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు.
మృతులంతా వారణాసిలోని ఒక మదర్సా విద్యార్థులని, ఇటీవల బరేలీని సందర్శించి, వారణాసికి వెళ్లే రైలు ఎక్కడం కోసం వేర్వేరు వాహనాల్లో ఢిల్లీకి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. కారు అతివేగంతో ప్రయాణిస్తుండటం, డ్రైవర్ నిద్రమబ్బు కారణంగా వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
