అపోలో ఆస్పత్రిలోనే కరోనాను గుర్తించాం: ఉపాసన కొణిదెల

అపోలో ఆస్పత్రిలోనే కరోనాను గుర్తించాం: ఉపాసన కొణిదెల

బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ.. వైరస్ లక్షణాలు ఉంటే సమీప ఆస్పత్రికి వెళ్లాలన్నారు ఉపాసన కొణిదెల. కరోనా వైరస్ పై ఉపాసన మంగళవారం ట్వీట్ చేశారు. తెలంగాణ లో కరోనా వైరస్ సోకినట్టుగా చెబుతున్న వ్యక్తిని  ముందుగా సికింద్రాబాద్ లోని తమ అపోలో హస్పిటల్ లోనే  గుర్తించామని.. అపోలోలో స్క్రీనింగ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తున్నామని ఆమె  చెప్పారు. జ్వరంతో వచ్చిన రోగి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి గుర్తించామని.. ఆస్పత్రిలోని మిగతా రోగులను అతనికి దూరంగా ఉంచామని చెప్పారు. ప్రస్తుతం ఆ రోగి గాంధీలో రోగి చికిత్స పొందుతున్నాడని చెబుతూ..  అపోలోలో అతనికి చికిత్స చేసిన సిబ్బందిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో(క్వారెంటైన్ లో) ఉంచామన్నారు.

వైరస్ ఇతరులకు వ్యాపించకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా అత్యధిక ప్రమాణాలు పాటిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఉపాసన.. కరోనా వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ ద్వారా చెప్పారు. ఈ వైరస్ కి యాంటి బయాటిక్స్ ఏవీ పని చేయవని, జలుబు, దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు ఉంటే మెడిసిన్స్ వేసుకోకుండా ముందుగా డాక్టర్ ని సంప్రదించాలని తెలిపారు. రెగ్యులర్ గా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్క్ లు ధరించాలని చెప్పారు. నాన్ వెజిటిరియన్స్ మాంసాహారానికి దూరంగా ఉండాల్సిన అవసరమేమీ లేదని, వండిన మాంసాన్ని తినొచ్చని చెప్పారు.