- మార్చిలోగా లక్ష.. జూన్ నాటికి మరో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు: మంత్రి పొంగులేటి
- ఏప్రిల్ నుంచి రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీసహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జీ ప్లస్ త్రీ (జీ+3) పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు అతి త్వరలోనే ‘అర్బన్ హౌసింగ్ పాలసీ’ని ప్రకటించబోతున్నట్టు చెప్పారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ 3 పద్ధతిలో ఇండ్లు నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
గృహనిర్మాణ శాఖ రెండేండ్ల ప్రగతి, భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాకు మంత్రి పొంగులేటి వివరించారు. రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. వచ్చే మార్చి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, జూన్ నాటికి మరో 2 లక్షల ఇండ్లను పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటివరకు దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇండ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. మూడో విడతలో స్థలాలు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఓఆర్ఆర్ చుట్టూ మధ్య తరగతి ప్రజలకు ఇండ్లు
కేవలం పేదలకే కాకుండా.. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. సరసమైన ధరలకే ఇండ్లు అందించేలా ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓఆర్‌ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించామని వెల్లడించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించి హైరైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
ఇండ్లకోసం ఎవరైనా లంచాలు అడిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 9 మంది పంచాయతీ కార్యదర్శులను ఇప్పటికే సస్పెండ్ చేశామని, మరో ఇద్దరిని సర్వీసు నుంచి తొలగించామని తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను రూ. 700 కోట్లతో పూర్తి చేశామని చేశామని వివరించారు.
కేటీఆర్‌ది విషపూరితమైన ఆలోచన
హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బీఆర్ఎస్ పాలనలో వచ్చినవేనని, ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్ సంతకం చేసిన సంగతి మరిచారా అని పొంగులేటి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపొలిస్ ప్లాట్లను వేలం వేశారని, హిల్ట్‌ను దోపిడీ పాలసీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా అని అడిగారు. కేటీఆర్‌ది విషపూరితమైన ఆలోచన అని మండిపడ్డారు.
