హైదరాబాద్, వెలుగు: యూరియా బుకింగ్ యాప్ నకు రైతులను విశేష ఆదరణ లభిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యూరియా యాప్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలు ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని, పారదర్శకతతో కూడిన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గురువారం ఆయన ఒక ప్రకనటనలో పేర్కొన్నారు. గత యాసంగి సీజన్‌లో 21.81 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 97.95 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని తెలిపారు.
ప్రస్తుత వానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11.71 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని వివరించారు. అందులో ఇప్పటికే 34 లక్షల యూరియా సంచులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85.84 లక్షల యూరియా సంచుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల ఎరువుల విక్రయ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 5.74 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని వెల్లడించారు.
