మళ్లీ యుద్ధం తీవ్ర స్థాయిలో జరగటానికి అంతా సిద్ధం అయ్యిందా.. యుద్ధం మరో దశలోకి ఎంట్రీ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. 2026, మే 26వ తేదీ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెంచింది. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అన్నట్లు పరిణామాలు ఉన్నాయి.
ఇరాన్ గగనతలంలోకి వచ్చిన అమెరికా రీపర్ డ్రోన్.. అంటే విమానం సైజులో ఉండి.. బాంబులను వేయగల డ్రోన్ ఇది. MQ 9 పేరుతో వీటిని పిలుస్తారు. అమెరికాకు చెందిన ఈ రీపర్ డ్రోన్ ను ఇరాన్ కు చెందిన IRGC కూల్చివేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్. దేశ రక్షణలో రాజీ లేదని.. ఎవర్నయినా ఢీకొంటామని స్పష్టం చేసింది ఐఆర్ జీసీ.
డ్రోన్ కూల్చివేత తర్వాత అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్ లోని క్షిపణి ప్రయోగ స్థావరాలను టార్గెట్ చేసి.. బాంబుల వర్షం కురిపించింది అమెరికా. సముద్ర తీరంలో మందు పాతరలు అమర్చే నౌకలను సైతం ధ్వంసం చేసింది అమెరికా విమానాలు. ఈ దాడులను అధికారికంగా ధృవీకరించిన అమెరికా ఆర్మీ అధికారి.. ఆత్మ రక్షణ దాడులుగా అభివర్ణించారు. ఇరాన్ దక్షిణం వైపు ఉన్న బందర్ అబ్బాస్ అనే పోర్టుపైనా బాంబులు వేసింది అమెరికా.
ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించటం.. శాంతియుత డీల్ లో భాగంగా చర్చల కోసం.. న్యూయార్క్ చేరుకున్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా.. రెండు దేశాలు కాల్పుల విరమణను పాటించాలని సూచించారు. పాక్ విదేశాంగ మంత్రి న్యూయార్క్ లో ఉండగానే.. అమెరికా డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయటం.. ఇరాన్ పై అమెరికా భీకరంగా దాడులకు దిగటం జరిగింది.
వరసగా జరుగుతున్న పరిణామాలపై ఇరాన్ సుప్రీం మెజ్తాబా ఖమేనీ పేరుతో ఓ ప్రకటన విడుదల అయ్యింది. అమెరికా ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే.. యుద్ధం ఆపకపోతే గల్ఫ్ దేశాల్లోని ఏ ఒక్క అమెరికా స్థావరం సురక్షితంగా ఉండదని.. ఉండబోదని హెచ్చరించారు.
ప్రయోజనాలు రెండు దేశాలకు సమానంగా ఉండాలని.. ఏకపక్షంగా ఉండకూదన్నారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం స్నేహం, సహకారం కోసం చిత్తశుద్ధితో ఆహ్వానిస్తున్నాం అని.. స్వచ్ఛతతో చర్చలు జరగాలంటూ పిలుపునిచ్చారు ఖమేనీ.
