రాష్ట్రంలో సీఐఎల్ రూ.300 కోట్ల పెట్టుబడి..  కెమ్తత్వ సంస్థతో అమెరికా కంపెనీ కీలక ఒప్పందం

రాష్ట్రంలో సీఐఎల్ రూ.300 కోట్ల పెట్టుబడి..  కెమ్తత్వ సంస్థతో అమెరికా కంపెనీ కీలక ఒప్పందం
  • జీనోమ్ వ్యాలీలో ఐసోటోప్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు
  • మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లేబొరేటరీస్ (సీఐఎల్) రాష్ట్రంలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్​కు చెందిన కెమ్​తత్వ కైరల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి జాయింట్​ వెంచర్​ను ఏర్పాటు చేయనుంది. జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4లో మూడేండ్లలోగా ఫార్మాస్యుటికల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, ఓఎల్​ఈడీ మెటీరియల్స్, సెమీకండక్టర్ అప్లికేషన్లలో వాడే ఐసోటోప్ మాలిక్యూల్స్​ను తయారు చేసే ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నారు.

మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 250 మందికిపైగా ఉపాధి కల్పించనున్నారు. శనివారం ఐటీ, ఇండస్ట్రీస్​శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సీఐఎల్ సీఈవో క్లిఫ్ కాల్డ్​వెల్, సీఎఫ్​వో జాన్ బక్కీ, ఆ సంస్థ వైస్​ప్రెసిడెంట్ గ్రెగరీ విట్నీ, కెమ్​తత్వ కైరల్ సొల్యూషన్స్​ సీఈవో విశాల్​ రాజ్​పుత్​, డైరెక్టర్​ వినోద్​ కుమార్​లు సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లైఫ్​సైన్సెస్, స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో తెలంగాణ గమ్యస్థానంగా మారుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న లైఫ్​సైన్సెస్ ఎకోసిస్టమ్​పై విదేశీ సంస్థలకు ఉన్న నమ్మకానికి సీఐఎల్, కెమ్​తత్వ ఒప్పందమే నిదర్శనమన్నారు. ఈ ఒప్పందం.. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్​ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని మరింత పటిష్టం చేస్తుందని తెలిపారు. సీఐఎల్ ఒప్పందంతో ఐసోటోపులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి తగ్గుతుందని లైఫ్​సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్ చెప్పారు.

ఐసోటోప్స్ తయారీలో కెమ్​తత్వ ఐదేండ్లలో లీడర్​గా ఎదిగిందని సంస్థ సీఈవో విశాల్​ రాజ్​పుత్​ తెలిపారు. సీఐఎల్​ ఒప్పందంతో ఐసోటోపుల తయారీకి సంబంధించి తెలంగాణను ప్రపంచస్థాయి మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మార్చేందుకు దోహదం చేస్తుందన్నారు. అడ్వాన్స్డ్​ కెమిస్ట్రీ, లైఫ్​సైన్సెస్​ మాన్యుఫ్యాక్చరింగ్​కు తెలంగాణలో బలమైన ఎకోసిస్టమ్​ ఉన్నదని సీఐఎల్​ సీఈవో క్లిఫ్​ కాల్డ్​వెల్​ అన్నారు.

టాంజానియాకు సహకారం అందిస్తం 

డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేలా టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్, ఇన్నొవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్ మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేస్తామన్నారు.

 శనివారం సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నొవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని సభ్యులు మంత్రి శ్రీధర్​ బాబుతో సమావేశమయ్యారు. ఈ  శ్రీధర్ బాబు మాట్లాడుతూ టాంజానియాలో  ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్టడీ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ్’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్​నర్’గా వ్యవహరిస్తామన్నారు.