- అమెరికా, ఇరాన్ చర్చలపై సందిగ్ధం
- ఇవాళ్టి (ఏప్రిల్ 22)తో ముగియనున్న సీజ్ ఫైర్ గడువు
- పొడిగింపు ఉండదని తేల్చి చెప్పిన ట్రంప్
- ఒప్పందం కుదరకపోతే బాంబులు పేలుతాయని వార్నింగ్
- కొత్త వ్యూహాలతో రెడీగా ఉన్నామన్న ఇరాన్
- చర్చలకు హాజరుకాబోమని వెల్లడి
- పాక్ పర్యటన వాయిదా వేసుకున్న జేడీ వాన్స్ బృందం
టెహ్రాన్/ఇస్లామాబాద్/వాషింగ్టన్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఇరాన్, అమెరికా రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధం నెలకొంది. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు బుధవారం నాటితో ముగియనుండగా.. ఈ గడువును పొడిగించే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మరోవైపు, హార్మూజ్ లో దిగ్బంధాలు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా చర్చలను లొంగుబాటుగా మార్చాలని లేదా మళ్లీ యుద్ధం ప్రారంభించడాన్ని సమర్థించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
"బెదిరింపుల నీడలో మేం చర్చలకు అంగీకరించం. గత రెండు వారాల్లో యుద్ధ క్షేత్రంలో కొత్త వ్యూహాలను అమలుచేయడానికి మేం సిద్ధమయ్యాం" అని ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో మళ్లీ యుద్ధం మొదలైతే తమ వద్ద "కొత్త వ్యూహాలు" సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
అయితే, హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ఉన్న నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో చర్చలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. అమెరికా మితిమీరిన డిమాండ్లు, అవాస్తవిక అంచనాలు, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగానే తాము చర్చల్లో పాల్గొనడం లేదని తెలిపింది.
కానీ, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే శాంతి చర్చలకు అమెరికా ప్రతినిధి బృందం హాజరవుతుందని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఇస్లామాబాద్‌లో మంగళవారం చర్చలు జరుగుతాయని ట్రంప్ మొదట చెప్పారు. కానీ మంగళవారం రాత్రి వరకూ సందిగ్ధం కొనసాగింది. రాత్రి వరకూ వేచి చూసిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. చర్చలకు హాజరుకాబోమన్న స్టాండ్‌కు ఇరాన్ కట్టుబడి ఉండడంతో తన పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి బుధవారం చర్చల కోసం జేడీ వాన్స్ బృందం మంగళవారం బయలుదేరి పాకిస్తాన్ వెలుతుందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ బృందంలో ట్రంప్ పశ్చిమాసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారని తెలిపారు.
చాలా బాంబులు పేలుతయ్..
చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌తో ఉన్న బలహీనమైన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ఎటువంటి పురోగతి లేకుండా ముగిస్తే, ‘అప్పుడు చాలా బాంబులు పేలడం మొదలవుతాయి’ అని ఆయన హెచ్చరించారు. ‘నేను చెప్పేది ఏమిటంటే, వారు చర్చలకు రావాలి. వారు రాలేదని చెబుతున్నప్పటికీ, మేం రావడానికి అంగీకరించాం. అంతా సిద్ధమైంది. వారు వస్తారో లేదో చూస్తాం. ఒకవేళ వారు రాకపోయినా మాకు ఇబ్బంది లేదు’ అని అన్నారు.
మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సీఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘మేం చర్చల్లో పటిష్టమైన స్థితిలో ఉన్నాం. గొప్ప ఒప్పందంతో ముగింపు పలుకుతాం’ అని ఆయన చెప్పారు. సైనిక పరంగా వాషింగ్టన్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆయన సమర్థించుకున్నారు. అమెరికా నావికా దళ దిగ్బంధనం విజయవంతమైందని ప్రకటించారు.
అలాగే కాల్పుల విరమణను పొడిగించడం మాత్రం తనకు ఇష్టంలేదని ట్రంప్ తేల్చిచెప్పారు. ‘‘మేం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. కాల్పుల విరమణకు ముందు కంటే ఇప్పుడు మరింత శక్తిమంతంగా ఉన్నాం. మేం ఈ విరామాన్ని మా ఆయుధ సంపత్తిని నింపుకోవడానికి ఉపయోగించుకున్నాం. వారు కూడా బహుశా కొంతమేర అలాగే చేసి ఉండవచ్చు” అని ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు.
చర్చల్లో పాల్గొననున్న ట్రంప్..?
ఒప్పందంపై సంతకాలు చేసే పరిస్థితి ఉంటే, ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో జరగనున్న ముఖాముఖి శాంతి చర్చలకు ట్రంప్ ‘వ్యక్తిగతంగా లేదా వర్చువల్’ పద్ధతిలో హాజరుకావచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుండగా, దీనిని పొడిగించే అవకాశంలేదని ట్రంప్ ఇప్పటికే చెప్పారు.
వారాంతంలో హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో చర్చలకు హాజరుకాబోమని ఇరాన్ హెచ్చరించినప్పటికీ, చర్చలు జరుగుతాయని అమెరికా ధీమా వ్యక్తం చేసింది. అయితే, అంతకుముందు చర్చలను తోసిపుచ్చిన ఇరాన్, ఇప్పుడు తన భాగస్వామ్యంపై ‘సానుకూలంగా సమీక్షిస్తోందని’ ఒక సీనియర్ ఇరాన్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వెల్లడించింది. కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
చర్చలకు పాకిస్తాన్ ఏర్పాట్లు
ఇరాన్, అమెరికా మధ్య ప్రధాన చర్చల ప్రతినిధిగా అవతరించిన పాకిస్తాన్, చర్చల నిర్వహణపై అనిశ్చితి ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేస్తోంది. ఇస్లామాబాద్ అంతటా దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ చర్చల కోసం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మంగళవారం(అమెరికా టైం) పాకిస్తాన్ వెళతారని ఆక్సియోస్ మీడియా సంస్థ తెలిపింది.

