అమెరికా-, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
14 సూత్రాల ఫ్రేమ్‌వర్క్తో కుదిరిన చరిత్రాత్మక డీల్
19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు..107 రోజుల యుద్ధానికి తెర!
ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్
హార్మూ జ్ జలసంధి పునరుద్ధరణకు ఆదేశాలు.. టోల్ ఫ్రీగా నౌకల రవాణాకు పిలుపు
పన్ను వసూలు చేసుకుంటం.. కేవలం 60 రోజులు మాత్రమే టోల్‌ఫ్రీ: ఇరాన్
అణు కార్యక్రమాలు, ఆంక్షల తొలగింపుపై ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయి
ఈ ఒప్పందం పరస్పర నమ్మకం, నిబంధనల
అమలుపైనే ఆధారపడి ఉంటుందని కామెంట్
వాషింగ్టన్:ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి కారణమైన 107 రోజుల సుదీర్ఘ యుద్ధానికి తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ పీస్ డీల్‌పై జూన్ 19న స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ దేశం ఆతిథ్యమివ్వనుందని సోమవారం వెల్లడించారు. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రాత్రి తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తక్షణమే పునరుద్ధరిస్తున్నట్టు, ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ప్రపంచ దేశాల నౌకలు.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను ప్రారంభించండి” అని పిలుపునిచ్చారు. ఈ జలసంధి గుండా రవాణా టోల్‌ఫ్రీ అని ప్రకటించారు. అయితే, హార్మూజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి రుసుములు (ఫీజులు) వసూలు చేసే హక్కును అమెరికా గుర్తించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ వెల్లడించింది. చివరి నిమిషంలో జరిగిన చర్చల్లో ఈమేరకు ఒప్పంద పత్రంలో మార్పులు జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ జలసంధిని టోల్-ఫ్రీగా పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి ఈ భిన్నమైన నివేదిక రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం అధికారిక సంతకాల అనంతరం మైన్ల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యాక ఈ జలసంధి పూర్తిగా అందుబాటులోకి రానున్నది. అలాగే, 14 సూత్రాల ఫ్రేమ్ వర్క్‌పై 60 రోజులపాటు చర్చలు జరిపి.. అనంతరం ఇరు దేశాలూ ఆమోదించేలా ఒక శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేయడం, ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్‌ను ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించి వెనక్కి తగ్గడంలాంటి తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల మధ్య.. ట్రంప్ 80వ పుట్టినరోజు నాడే ఈ ఒప్పందం ఖరారు కావడం విశేషం.
మారిటైమ్ సర్వీసెస్ పేరుతో ఇరాన్ కొత్త వ్యూహం!
హార్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ దేశాల సార్వభౌమాధికారాన్ని, పర్యవేక్షణను స్పష్టం చేసేలా ఒప్పందంలో మార్పులు జరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ జలసంధిలో మారిటైమ్ సర్వీసెస్ (సముద్ర సేవలు) నిర్వహణ భవిష్యత్తులో ఇరాన్, ఒమన్‌ల పరిధిలోనే ఉంటుందని తుది పత్రంలో పొందుపరిచారు. ఈ పదాన్ని చేర్చడమే వాషింగ్టన్ నుంచి తమకు లభించిన పెద్ద విజయంగా ఇరాన్ భావిస్తోంది. దీని ప్రకారం.. నౌకల భద్రత, నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, ఇన్సూరెన్స్ సేవల పేరిట ఇరాన్ ఈ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. ఈ నిధులను తమ దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించాలని ఇరాన్ యోచిస్తోంది. ఈ వ్యూహంలో జలసంధికి అవతలి వైపున ఉన్న ఒమన్ దేశ సహకారాన్ని కూడా ఇరాన్ ఇప్పటికే చర్చల ద్వారా దక్కించుకున్నట్టు సమాచారం.
ఉద్రిక్తతలు సద్దుమణిగేనా?
అమెరికా– ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఇరాన్ దాడులకు దిగితే తీవ్రస్థాయిలో బదులిస్తామని, తమ సైన్యం దక్షిణ లెబనాన్‌లోనే కొనసాగుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను పూర్తిగా అడ్డుకోవాల్సిన బాధ్యత అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం పూర్తిగా పరస్పర నమ్మకం, నిబంధనల అమలుపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ స్పష్టం చేశారు. సంతకాల అనంతరం 60 రోజుల పాటు అణు కార్యక్రమాలు, ఆంక్షల తొలగింపుపై ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లకు ఊరట..
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా.. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణే తాజా శాంతి ఒప్పందానికి దారితీసింది. ఈ చరిత్రాత్మక పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వాగతించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పీస్ డీల్ అంతర్జాతీయ చమురు మార్కెట్లకు భారీ ఊరటనిస్తుందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు స్థిరత్వాన్ని చేకూరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రోజులు మాత్రమే ఉచితం!
ట్రంప్ ప్రకటించినట్లుగా ఓడలు ఉచితంగా ప్రయాణించేందుకు ఒప్పుకున్నాం కానీ, అది కేవలం 60 రోజుల పరిమిత కాలానికి మాత్రమేనని ఇరాన్ స్పష్టం చేసింది. ‘‘ఫీజులు వసూలు చేసే సూత్రానికి అమెరికా అంగీకరించింది. ఇరాన్ కేవలం 60 రోజుల పాటు డిస్కౌంట్ ఇచ్చింది అంతే” అని పేర్కొన్నది. ఈ నెల19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు పూర్తయిన తర్వాత ఈ 60 రోజుల ఉచిత గడువు ప్రారంభం కానుంది. ఈ గడువు ముగియగానే ఇరాన్ తన అసలు పన్నుల వసూలు ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఒప్పందం కుదిరినట్టు ఇరుపక్షాలు ప్రకటించినా.. లీక్ అయిన తాజా రూల్స్‌పై అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇరాన్ క్లెయిమ్ నిజమైతే, భవిష్యత్తులో అంతర్జాతీయ చమురు రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ ఒప్పందంతో నష్టమే: ఇజ్రాయెల్ మంత్రి
జెరూసలెం: అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల తమతోపాటు ప్రపంచానికీ నష్టమేనని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ అభిప్రాయపడ్డారు. ఒప్పందంపై ‘ఎక్స్’లో స్పందించిన స్మోట్రిచ్, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా అడ్డుకోవాలనే లక్ష్యాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తుందన్నారు. ఇప్పటికే ఇరాన్ సామర్థ్యాలను బలహీనపరిచామని, ఇకనుంచి టెహ్రాన్ పాలక వ్యవస్థను కూలదోయడానికి పోరాటం చేయాలన్నారు. ఉత్తర సరిహద్దుల నుంచి హిజ్బుల్లాను పూర్తిగా తరిమికొట్టేందుకు రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేలా కృషి చేస్తానని స్మోట్రిచ్ పేర్కొన్నారు. కాగా, లెబనీస్ అధికారుల ప్రకారం.. మార్చి 2 నుంచి జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో 3,700 మందికి పైగా మరణించారు.
వాణిజ్య స్వేచ్ఛకు భరోసా: మోదీ
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. తాజా ఒప్పందంతో ఇరుదేశాల్లో త్వరలోనే శాంతి, స్థిరత్వం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఎంతో భరోసా ఇస్తుందని అన్నారు. మిగిలిన వివాదాస్పద అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య త్వరలోనే శాశ్వతమైన ఒప్పందం కుదురుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.
ముసాయిదాలోని 14 కీలక సూత్రాలు
- సైనిక చర్యల తక్షణ నిలిపివేత: అన్ని రకాల పోరాటాలకు, దాడులకు తక్షణమే స్వస్తి పలకడం.
- హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ: అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడం.
- ఇరాన్ పోర్ట్‌లపై ఆంక్షల ఎత్తివేత: ఇరాన్ ఓడరేవులపై ఉన్న అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలను తొలగించడం.
- కొత్త ఆంక్షలపై నిషేధం: చర్చలు జరుగుతున్నంత కాలం అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించకూడదు.
- చమురు ఎగుమతులకు తాత్కాలిక మినహాయింపులు: ఇరాన్ చమురు ఎగుమతి చేసుకోవడానికి వీలుగా అమెరికా తాత్కాలిక వేవర్లు (మినహాయింపులు) ఇస్తుంది.
- స్తంభింపజేసిన నిధుల విడుదల: విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల కొద్దీ ఇరాన్ నిధులను విడుదల చేయడం.
- 60 రోజుల చర్చల సమయం: తదుపరి సమగ్ర ఒప్పందం కోసం ఇరు దేశాలకూ 60 రోజుల గడువు.
- అణ్వాయుధాల తయారీ రద్దు: తాము అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ కట్టుబడి ఉండటం.
- యురేనియం శుద్ధీకరణ నిలిపివేత: ఇంధన శుద్ధీకరణ ప్రక్రియను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయడం.
- అణు కేంద్రాల విస్తరణపై ఫ్రీజ్: ప్రస్తుతం ఉన్న అణు కేంద్రాలను మరిన్ని నిధులు లేదా సాంకేతికతతో విస్తరించకుండా ఆపడం.
- నిల్వలపై చర్చలు: ఇరాన్ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల భవిష్యత్తుపై చర్చలు జరపడం.
- ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు: పశ్చిమాసియా వ్యాప్తంగా శాంతిభద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడం.
- ఆర్థిక, పునర్నిర్మాణ చర్చలు: యుద్ధ నష్టాల నివారణకు, ఆర్థిక వృద్ధికి అవసరమైన చర్చలు జరపడం (ఇరాన్ మీడియా కథనాల ప్రకారం దాదాపు 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్యాకేజీపై చర్చలు వచ్చే అవకాశం ఉంది).
- తుది సమగ్ర ఒప్పంద రూపకల్పన: ఈ 60 రోజుల అనంతరం ఇరు దేశాలూ ఆమోదించేలా ఒక శాశ్వత శాంతి ఒప్పందాన్ని
- ఖరారు చేయడం.
