కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. ఇవాళ (జూన్ 08) మన స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి..?

కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. ఇవాళ (జూన్ 08) మన స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి..?

న్యూఢిల్లీ: ఈ వారం  స్టాక్ మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను గ్లోబల్‌‌ అంశాలు నిర్ణయించనున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, యూఎస్ మార్కెట్ల పతనం, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌ఐఐల) కదలికలు  మార్కెట్ గమనాన్ని శాసించనున్నాయి.  

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి భారీగా కుప్పకూలాయి. ముఖ్యంగా నాస్‌‌డాక్  ఏకంగా 4.18శాతం పతనమై ఏప్రిల్ 2025 తర్వాత అత్యంత దారుణమైన సింగిల్-డే నష్టాన్ని చవిచూసింది. సెమీకండక్టర్, టెక్నాలజీ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. 

దీంతో గిఫ్ట్ నిఫ్టీ కూడా 1.5 శాతం పడింది. భారతీయ సూచీల్లో ఐటీ  రంగానికి పెద్ద వాటా ఉంది. దీంతో  సోమవారం ఉదయం మన మార్కెట్లు కూడా తీవ్ర ఒత్తిడితో లేదా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు  జూన్ 12న (బుధవారం) భారత్‌‌లో మే నెల ద్రవ్యోల్బణ  గణాంకాలతో పాటు ఫారెక్స్ రిజర్వుల డేటా విడుదల కానుంది. 

అదేవిధంగా బుధవారం అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణ డేటా కూడా రానుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వడ్డీ రేట్లను తగ్గిస్తుందా లేదా అనేది ఈ డేటాపైనే ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు చైనా మాక్రో డేటా కూడా విడుదల కానుంది. ఇవి మార్కెట్‌‌పై ప్రభావం చూపుతాయి.  అమెరికా–-ఇరాన్ చర్చల పరిణామాలు, పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలు గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులను  కొనసాగించొచ్చు.

  ఆర్‌‌బీఐ పాలసీ తర్వాత రూపాయి బలోపేతం కావడం, చమురు ధరలు తగ్గడం, బలమైన జీడీపీ వృద్ధి,  దేశంలో నైరుతి రుతుపవనాల  విస్తరణ వంటి అంశాలు మార్కెట్‌‌కు మద్దతుగా నిలవనున్నాయి.