ఇక చాలు.. యుద్ధం ఆపండి..రష్యా, ఉక్రెయిన్‌‌‌‌కు ట్రంప్ పిలుపు

ఇక చాలు.. యుద్ధం ఆపండి..రష్యా, ఉక్రెయిన్‌‌‌‌కు ట్రంప్ పిలుపు

వాషింగ్టన్: యుద్ధాన్ని వెంటనే ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌‌‌‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. యుద్ధం ఇప్పుడెక్కడైతే ఉందో, అక్కడే ఆపేయాలని సూచించారు. శుక్రవారం వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌‌‌‌స్కీతో ట్రంప్ దాదాపు రెండు గంటలకు పైగా సమావేశమయ్యారు. అనంతరం ఆయన సోషల్ ట్రూత్‌‌‌‌లో పోస్టు పెట్టారు. 

‘‘రక్తం పారింది ఇక చాలు. వెంటనే యుద్ధాన్ని ఆపండి. మీరు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఆపేయండి. ఇద్దరూ విజయాన్ని ప్రకటించుకోండి. అది చరిత్రనే నిర్ణయించనివ్వండి” అని రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్‌‌‌‌స్కీని ఉద్దేశించి పోస్టులో పేర్కొన్నారు. ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ ‘‘చంపడం ఇక ఆపండి. వెంటనే యుద్ధాన్ని ముగించండి. లేదంటే సమస్య మరింత జఠిలమవుతుంది” అని ట్రంప్​ సూచించారు.

ట్రంప్ యూటర్న్.. 

ఇన్ని రోజులు ఉక్రెయిన్‌‌‌‌కు మద్దతుగా నిలిచిన ట్రంప్.. ఇప్పుడు రష్యాకు అనుకూలంగా మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని ఇన్ని రోజులు రష్యాపై ఒత్తిడి తెచ్చిన ఆయన.. ఇప్పుడు ఆ భూభాగాన్ని రష్యానే ఉంచుకోవాలని సూచించారు. అలాగే యుద్ధం ఆపకపోతే  తమ దగ్గరున్న తోమహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌‌‌‌కు ఇస్తామని ఇంతకుముందు రష్యాను బెదిరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చారు. 

తాము అమెరికాకు అడ్వాన్స్‌‌‌‌డ్ డ్రోన్లు ఇస్తామని, బదులుగా యూఎస్ తమకు తోమహాక్ మిసైల్స్ ఇస్తుందని మీటింగ్‌‌‌‌కు ముందు జెలెన్‌‌‌‌స్కీ చెప్పారు. అవి రష్యాతో యుద్ధంతో గేమ్‌‌‌‌ ఛేంజర్‌‌‌‌‌‌‌‌గా మారతాయని ఉక్రెయిన్ భావించింది. అయితే మీటింగ్‌‌‌‌లో మాత్రం తోమహాక్ క్షిపణులు ఇవ్వలేమని జెలెన్‌‌‌‌స్కీకి ట్రంప్ తేల్చి చెప్పారు.

ఇక ఆపాల్సిందే: జెలెన్‌‌‌‌స్కీ 

యుద్ధం ముగించాల్సిన సమయం వచ్చిందని జెలెన్‌‌‌‌స్కీ అన్నారు. ఇక ఇది చర్చలు, కాల్పుల విరమణ టైమ్ అని పేర్కొన్నారు. ‘‘యూఎస్ ప్రెసిడెంట్ చెప్పింది నిజమే. మేం ఇక ఉన్నచోటనే ఆపేయాలి. ఆ తర్వాత చర్చలు ప్రారంభించాలి” అని తెలిపారు. తోమహాక్ మిసైల్స్ ఇస్తామని గానీ, ఇవ్వమని గానీ ట్రంప్ ఇంకా చెప్పలేదన్నారు. అయితే రష్యాకు భూభాగాన్ని వదులుకోవాలని ట్రంప్ సూచించగా, దానిపై మీడియాకు జెలెన్‌‌‌‌స్కీ జవాబు దాటవేశారు.