- ‘వార్ పవర్స్ రెజల్యూషన్’ను ఆమోదించిన ఎగువసభ
- ఇది అసందర్భం.. అర్థరహితమని ట్రంప్ మండిపాటు
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను అడ్డుకోవాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) ఎగువ సభ సెనేట్ తొలిసారిగా ఒక యుద్ధ అధికారాల తీర్మానం(వార్ పవర్స్ రెజల్యూషన్)ను ఆమోదించింది. ప్రభుత్వం తనంతట తానుగా ప్రారంభించిన, ప్రస్తుతం నిధుల కోసం కాంగ్రెస్ ఆమోదం అవసరమైన ఈ యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 50-–48 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. గతంలో నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు యుద్ధ అధికారాల తీర్మానాలకు అనుకూలంగా ఓటు వేయగా, మంగళవారం కూడా వారు అదే బాటలో నడిచారు. అలా ఓటేసిన వారిలో అలాస్కాకు చెందిన లిసా ముర్కోవ్‌స్కీ, మైన్‌కు చెందిన సుసాన్ కాలిన్స్, కెంటకీకి చెందిన రాండ్ పాల్, లూసియానాకు చెందిన బిల్ కాసిడీ ఉన్నారు. పెన్సిల్వేనియాకు చెందిన ఒకే ఒక్క డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ మాత్రం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
మరోవైపు ఈ ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ ఇటీవల ఆసుపత్రిలో చేరినందున గైర్హాజరయ్యారు. అలాగే, సెనేటర్ డేవ్ మెక్‌కార్మిక్ కూడా ఈ ఓటింగ్‌కు హాజరుకాలేదు. దీంతో వీరిద్దరి గైర్హాజరీ వల్ల ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి రిపబ్లికన్ పార్టీకి పూర్తి మెజారిటీ లేకుండా పోయింది. ఇరాన్ యుద్ధం కోసం వినియోగించిన మందుగుండు సామాగ్రి, నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి కాంగ్రెస్ నుంచి 80 బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వాలని అమెరికా రక్షణ శాఖ కోరుతున్న సమయంలోనే ఈ ఓటింగ్ జరిగింది.
అయితే, ఈ తీర్మానానికి పూర్తి చట్టబద్ధమైన బలం లేనప్పటికీ.. ఇది యుద్ధం, దానిని ముగించడానికి ఇరాన్‌తో ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోని పలువురు రిపబ్లికన్ సభ్యులలో ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. ప్రతినిధుల సభ (హౌస్) ఈ నెల ప్రారంభంలోనే ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ నలుగురు సెనేటర్లు లూజర్లు: ట్రంప్
ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా సెనేట్ తీర్మానం ఆమోదించడం పట్ల ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం రాత్రి తన ట్రూత్ సోషల్ వేదికపై మండిపడ్డారు. ఈ ఓటింగ్ ‘అసందర్భమైనది, అర్థరహితమైనది’ అని పేర్కొన్నారు. ఇది ఇరాన్‌కు ‘సహాయం, ఓదార్పు అందించింది’ అని అన్నారు. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన నలుగురు అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులపైనా ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘‘ఆ నలుగురు రిపబ్లికన్లను లూజర్లు. వారు నా పనిని మరింత కష్టతరం చేశారు’’ అని విమర్శించారు.
