T20 వరల్డ్ కప్ 2026లో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. అమెరికా, పాకిస్తాన్ జట్లు కొలంబో వేదికగా తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లు చివరిగా 2024 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో తలపడ్డాయి. డల్లాస్ గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో USA టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అమెరికా జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాక్ చేసినన్ని పరుగులు అమెరికా కూడా సాధించడంతో ఈ మ్యాచ్ టై అయింది. విజేతను తేల్చడానికి ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును అమెరికా జట్టు చిత్తుగా ఓడించింది.
The American fairytale continues 🇺🇸😍
— ICC (@ICC) June 6, 2024
USA beat Pakistan in one of the biggest results in #T20WorldCup history and are ready to take on India next.
Get your tickets now ➡️ https://t.co/FokQ0Cegga pic.twitter.com/ydqEQ3Onbx
పాకిస్తాన్ టీమ్పై ఆ జట్టు అభిమానులు దుమ్మెత్తిపోశారు. USA టీం చేతిలో ఓడిపోవడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇన్నాళ్లకు USA జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని.. ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పాకిస్తాన్ జట్టు భావిస్తోంది. అయితే.. అమెరికా జట్టును పసికూన జట్టు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. న్యూజిలాండ్తో జరిగిన వామప్ మ్యాచ్లో అమెరికా జట్టు అదరగొట్టింది. మొన్నటిమొన్న టీమిండియాను కూడా టెన్షన్ పెట్టింది. సూర్య కుమార్ యాదవ్ రాణించడంతో టీమిండియాకు పెద్ద గండం తప్పింది.
కివీస్లో వామప్ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ జట్టును అమెరికా జట్టు దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ వామప్ మ్యాచ్లో టాస్ గెలిచి USA బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్లాక్ క్యాప్స్పై జస్ట్ ఏడు పరుగుల తేడాతోనే అమెరికా ఓడింది. ఇలాంటి జట్టుపై అలవోకగా గెలుస్తామని పాక్ జట్టు భావిస్తే అంతకు మించిన అతి విశ్వాసం మరొకటి ఉండదు. మంగళవారం రాత్రి 7 గంటలకు పాక్, USA జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
