హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్: జంట రిజర్వాయర్లలోకి వరద.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్: జంట రిజర్వాయర్లలోకి వరద.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి
  •   హిమాయత్​ సాగర్​లో 1760.60 అడుగుల నీళ్లు
  • 800 క్యూసెక్కుల ఇన్​ఫ్లో   
  • ఉస్మాన్​సాగర్​లో 1784.30 అడుగులు
  • వాటర్ ​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు : జంటనగరాలకు తాగునీటినందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద రాక మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని అధికారులు తెలిపారు. మూడు, నాలుగు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంకా భారీగా నీరు వచ్చి చేరే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలోకి వస్తున్న ఇన్​ఫ్లోను వాటర్​బోర్డు  టెక్నికల్​టీమ్స్​నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. 

ఎండీ సమీక్ష

రిజర్వాయర్లకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో వాటర్​బోర్డు ఎండీ అశోక్​ రెడ్డి ఆదివారం  హిమాయత్ సాగర్ ను విజిట్​ చేశారు. 24 గంటలపాటు నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహం పెరిగితే నీటి విడుదల, నీటి మట్టాల మార్పులపై సంబంధిత శాఖలకు ముందస్తుగా సమాచారం అందజేయాలని అధికారులకు సూచించారు. 

సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, స్థానిక సంస్థలు, రిజర్వాయర్ల దిగువన ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. గేట్ల మెయింటనెన్స్, నీటి విడుదల , ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ముందే చెప్తామన్నారు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని, అవసరమైతే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎండీ సూచించారు.

ఒకట్రెండు వానలకే..

హిమాయత్​సాగర్ ​ఫుల్ ​ట్యాంక్​లెవెల్ 1763.50  అడుగులు కాగా, ప్రస్తుతం ఈ రిజర్వాయర్​లో 1760.60 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రవాహం ఇంకా కొనసాగుతోందన్నారు. ఉస్మాన్​సాగర్​ఫుల్​ ట్యాంక్ ​లెవెల్​ 1790.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1784.30 అడుగుల మేర నీళ్లున్నాయని, కొద్ది కొద్దిగా నీటి ప్రవాహం పెరుగుతోందన్నారు. మరో రెండు వర్షాలు కురిస్తే ఈ రెండు రిజర్వాయర్లు నిండే అవకాశం ఉంటుందంటున్నారు.