Usman Shinwari: ఆరేళ్ళ కెరీర్‌కు గుడ్ బై..ఆసియా కప్ ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

Usman Shinwari: ఆరేళ్ళ కెరీర్‌కు గుడ్ బై..ఆసియా కప్ ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

పాకిస్థాన్ లెఫ్టర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం( సెప్టెంబర్ 9)  ఇన్‌స్టాగ్రామ్‌లో షిన్వారీ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపాడు. "నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉంది. కానీ ఇప్పుడు తర్వాత తరానికి మార్గం చూపాల్సిన సమయం ఆసన్నమైంది". అని షిన్వారీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ అన్నాడు. 

"ఆటతో.. నా అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి నేను లీగ్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాను. అభిమానుల ప్రేమ, వారి సపోర్ట్ కు కృతజ్ఞుడిని".ఉస్మాన్ షిన్వారీ అన్నాడు. 31 ఏళ్ళ ఈ పాక్ పేసర్ ఆరేళ్ళ పాటు పాకిస్థాన్ జట్టు తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు.  2013లో శ్రీలంకపై టీ20 ద్వారా పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపైనే వన్డే, టెస్ట్ అరంగేట్రం చేశాడు. 17 వన్డేల్లో 34 వికెట్లు.. 16 టీ20 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఒకే టెస్ట్ ఆడిన షిన్వారీ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 

2019 లో చివరిసారిగా పాకిస్థాన్ తరపున ఆడిన ఈ పాక్ ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత ఆరేళ్ళు పాక్ జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. మరికొన్ని గంటల్లో ఆసియా కప్ ప్రారంభం అవుతుండగా.. ఈ పాక్ పేసర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. షార్జాలో శ్రీలంకపై ఐదు వికెట్లు..  పడగొట్టి 2019లో తన చివరి వన్డేలో శ్రీలంకపై మరోసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.  2018లో ఆసియా కప్‌ ఆడిన పాకిస్తాన్ జట్టులో కూడా ఉన్నాడు. తరచూ వెన్ను గాయం ఈ పాక్ పేసర్ కెరీర్ ను వెనక్కి నెట్టింది. చివరిసారిగా పాకిస్తాన్ జాతీయ టీ20 కప్‌లో క్వెట్టా రీజియన్ తరపున ఆడాడు.