అగ్నిపథ్ స్కీమ్​ను వినియోగించుకోండి

అగ్నిపథ్ స్కీమ్​ను వినియోగించుకోండి

సికింద్రాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎయిర్ ఫోర్స్ అకాడమీ పిలుపునిచ్చింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా త్రివిధ దళాల్లోకి ‘అగ్నివీర్’ల పేరుతో 17 నుంచి 21 ఏండ్ల యువతను రిక్రూట్ చేసుకోనున్నారని, ఇందుకోసం వారం రోజుల్లోనే నోటిఫికేషన్ రానుందని తెలిపింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని ‘కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్’లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. ఆలిండియా లెవెల్ లో ఆన్ లైన్ ఎగ్జాం ఉంటుందని, రాతపరీక్షతో పాటు ఫిజికల్ టెస్టులో పాసైన వాళ్లను అగ్నివీర్ లుగా తీసుకుంటామన్నారు. ఆరు నెలల ట్రెయినింగ్ తర్వాత వీరు నాలుగేండ్లు దేశసేవలో భాగస్వాములు అవుతారని తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు తర్వాత 25% మందిని రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటారని, మిగతా వారికి గ్రాట్యుటీ, పీఎఫ్​వంటివి చెల్లిస్తారన్నారు. అగ్నివీర్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లకు ఇతర ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.